Osmania University: తొలి స్వదేశీ సెమీకండక్టర్ చిప్
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:01 AM
ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. భారతదేశంలోని రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల చరిత్రలోనే తొలిసారిగా స్వదేశీ సెమీకండక్టర్ చిప్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఓయూ రికార్డు సృష్టించింది.

ఆవిష్కరించిన వీసీ ప్రొఫెసర్ కుమార్
రికార్డు సృష్టించిన ఉస్మానియా వర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. భారతదేశంలోని రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల చరిత్రలోనే తొలిసారిగా స్వదేశీ సెమీకండక్టర్ చిప్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఓయూ రికార్డు సృష్టించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) సహకారంతో భారత ప్రభుత్వ ఎలకా్ట్రనిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ(ఎంఈఐటీవై), సెంటర్ ఫర్ డెవల్‌పమెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీ-డాక్) మద్దతుతో చిప్స్-టు-స్టార్ట్‌ప(సీ2ఎస్) కార్యక్రమం కింద ఆల్-డిజిటల్ ఫేజ్-లాక్డ్ లూప్(ఏడీపీఎల్‌ఎల్) ఏఎ్‌సఐసీ చిప్ నమూనా రూపుదిద్దుకుంది. ఈ చొరవలో భాగంగా, మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబ్(ఎ్‌ససీఎల్)లో 180ఎస్‌ఎం సీఎంఓఎస్ టెక్నాలజీని ఉపయోగించిన ఓయూ బృందం ఏడీపీఎల్‌ఎల్ చిప్‌ను విజయవంతంగా తయారు చేసింది. అకడమిక్ కౌన్సిల్ సభ్యులు, విశ్వవిద్యాలయ అధికారులు, యూసీఈఓయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.మంగు, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ ఎ.కృష్ణయ్య, ఓయూ విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ బి.రాజేంద్ర నాయక్, ఈసీఈ హెడ్ ప్రొఫెసర్ పి.నవీన్ కుమార్, వివిధ విభాగాల అధిపతులు, బీఓఎస్ చైర్‌పర్సన్‌లు, ప్రాజెక్ట్ బృందం సమక్షంలో ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం ఈ చిప్‌ను అధికారికంగా శుక్రవారం ఆవిష్కరించారు.
రూ. 5కోట్ల సాయం..
యూసీఈవోయూ ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్ నేతృత్వంలోని బృందం కృషిని వైస్‌చాన్సలర్ ఎం.కుమార్ ప్రశంసించారు. ప్రొఫెసర్ నాయకత్వం సీ2ఎస్ కార్యక్రమం కింద రూ.5కోట్లు అందజేయడంతోపాటు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్(సీఐఐసీ)లో ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం, సౌకర్యాలు, పారిశ్రామిక సహకారాలకు మద్దతు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.
దాతల మద్దతుతో..
చిప్ తయారీకి బీసీ ఈసీఈ 1983 బ్యాచ్ రూ.50లక్షల విలువైన సర్వర్‌లను, మరో రూ.50 లక్షల విలువైన జీపీజీపీయూ సర్వర్‌లను చావాస్క్ సంస్థ అందించిందని ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. వారితో పాటు పూర్తి స్థాయి ఈడీఏ సాధనాలను అందించడంలో మద్దతు ఇచ్చినందుకు ఎంఈఐటీవై, సీడీఏసీలకు, ఓయూ వీసీకి కృతజ్ఞతలు తెలిపారు. తన బృంద సభ్యులను, సీబీఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జహంగీర్, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిస్బాహుద్దీన్‌లను అభినందించారు.