Share News

Osmania University: ఆర్ట్స్‌ కాలేజీకి ట్రేడ్‌ మార్క్‌ గుర్తింపు

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:34 AM

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల భవనానికి ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేషన్‌ దక్కింది. తాజ్‌ హోటల్‌, స్టాక్‌ ఎక్స్చేంజ్‌ భవనాల తర్వాత దేశంలో మూడో కట్టడంగా ఈ ఘనత సాధించింది.

Osmania University: ఆర్ట్స్‌ కాలేజీకి ట్రేడ్‌ మార్క్‌ గుర్తింపు

  • తాజ్‌ హోటల్‌, స్టాక్‌ ఎక్స్చేంజ్‌ భవనాల

  • తర్వాత దేశంలోని మూడో కట్టడంగా ఘనత

ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీ ముఖ చిత్రంగా ఉన్న ఆర్ట్స్‌ కళాశాల భవనానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్‌ మార్క్‌ భవనాల జాబితాలో ఈ నిర్మాణం చోటు దక్కించుకుంది. ముంబైలోని తాజ్‌ హోటల్‌, స్టాక్‌ ఎక్స్చేంజ్‌ భవనాల తర్వాత ట్రేడ్‌ మార్క్‌ కలిగిన మూడో కట్టడంగా ఆర్ట్స్‌ కళాశాల భవనం నిలిచింది. ఈ మేరకు మంగళవారం ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాన్ని ఓయూ పూర్వ విద్యార్థి సుభజిత్‌ సాహా.. ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కుమార్‌కు అందించారు. సుభజిత్‌ సాహా ఆర్ట్స్‌ కళాశాల భవనానికి ట్రేడ్‌ మార్క్‌ కోసం గత ఏడాది దరఖాస్తు చేశారు. ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా ఓయూ అనుమతి లేకుండా ఆర్ట్స్‌ కళాశాల భవనాన్ని ఎలాంటి వాణిజ్య ప్రకటనలు, వాణిజ్య అవసరాలకు వాడేందుకు అవకాశం ఉండదు. ఆర్ట్‌ కళాశాల భవనం ఉస్మానియా విశ్వ విద్యాలయానికి ముఖ చిత్రంగా ఉందని వీసీ ఎం కుమార్‌ అన్నారు. ఇప్పటికే ఎంతో గుర్తింపు, ప్రాధాన్యం ఉన్న ఈ భవనానికి ట్రేడ్‌ మార్క్‌ రిజిస్ట్రేషన్‌ దక్కడం మరింత గొప్ప విషయమని, ఓయూ విద్యార్థులకు ఇది గర్వకారణమని ఆయన అన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 05:34 AM