Nizamabad: సైబర్ పోలీసులకు చిక్కిన చిక్కాల
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:57 AM
సైబర్ మోసగాళ్లతో చేతులు కలిపిన నిజామాబాద్ వాసి చిక్కాల సంతోష్ కుమార్ గుట్టు రట్టయింది. హైదరాబాద్‌లోని వారాసిగూడలో ఉన్న సంతోష్..

కంబోడియా సైబర్ నేరగాళ్లకు మానవ అక్రమ రవాణ
హైదరాబాద్ వాసి ఫిర్యాదుతో సంతోష్ గుట్టు రట్టు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): సైబర్ మోసగాళ్లతో చేతులు కలిపిన నిజామాబాద్ వాసి చిక్కాల సంతోష్ కుమార్ గుట్టు రట్టయింది. హైదరాబాద్‌లోని వారాసిగూడలో ఉన్న సంతోష్.. 2015-16 లో ఎయిర్‌పోర్టు గ్రౌండ్ స్టాఫ్ వర్కర్‌గా పనిచేస్తూ వీసాలు, విదేశాల్లో ఉద్యోగాలపై అవగాహన పెంచుకున్నాడు. దాంతో కన్సల్టెన్సీ సంస్థను ప్రారంభించి.. యువతను విదేశాలకు పంపుతూ. తానూ కంబోడియాకెళ్లి.. సైబర్ నేరాలతో సులభంగా డబ్బు సంపాదించొచ్చనుకున్నాడు. ఉద్యోగాల పేర నిరుద్యోగులను అక్కడికి పంపి సైబర్ నేరగాళ్ల వద్ద నియమించేవాడు. మరోవైపు, నిజామాబాద్ యు వకులతో తెరిచిన ఖాతాల్లో జమఅయిన డబ్బును క్రిప్టో కరెన్సీలో సైబర్ నేర గాళ్లకు పంపేవాడు. కాగా, ఈ క్రమంలో హైదరాబాద్ వాసికి పరిచయమైన నేహ అనే యువతి..ఓ యాప్‌లో పెట్టుబడులతో లాభాలు గడిస్తున్నట్లు న మ్మించడంతో అతడు రూ.1.70 లక్షలు పెట్టుబడి ఓ ఖాతాకు పంపితే 20 వేల డాలర్ల లాభం చూపింది.
విత్‌డ్రా కోసం పన్ను చెల్లించాలంటే.. మరో రూ.4.82 లక్షలు మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేసినా విత్‌డ్రాకు అవకాశం లేదు. ఇంకా డబ్బు పంపాలనడంతో మోసపోయినట్లు గ్రహించి..సైబర్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడి ఖాతా నుంచి 4 నిజామాబాద్ ఖాతాల్లో డబ్బు జమ అయినట్లు గుర్తించారు. ఆ నలుగురిని విచారించడంతో వారు సంతోష్ పేరు చెప్పారు. అతడ్ని శుక్రవారం అరెస్టు చేసి విచారించడంతో విదేశీ కోణం బయటపడింది. నిందితుడి వద్ద 24 డెబిట్ కార్డులు, 5పాస్‌బుక్‌లు, 7 చెక్‌బుక్‌లు, లాప్‌టాప్, 15 మొబైల్ ఫోన్లు, రెండు ట్యాబ్‌లతోపాటు హైటెక్ టీవీ ప్రెస్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ అడిషినల్ సీపీ విశ్వ ప్రసాద్, డీసీపీ కవిత దార చెప్పారు.