బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో అత్యాధునిక రోబోటిక్ సర్జికల్ వ్యవస్థ
ABN , Publish Date - Feb 01 , 2025 | 05:09 AM
నొప్పి లేకుండా రోగులకు శస్త్రచికిత్సలు చేసేందుకు దోహదపడే డా విన్సీ రోబోటిక్ సర్జికల్ వ్యవస్థను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చారు.

ప్రారంభించిన ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్ సిటీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): నొప్పి లేకుండా రోగులకు శస్త్రచికిత్సలు చేసేందుకు దోహదపడే డా విన్సీ రోబోటిక్ సర్జికల్ వ్యవస్థను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చారు. ఆస్పత్రి చైర్మన్, ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర దేవితో కలసి శుక్రవారం దీన్ని ప్రారంభించారు. ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక లోగోను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తన తల్లి ఆశయాలకు అనుగుణంగా పేదలకు అందుబాటు ధరల్లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స అందించాలనే లక్ష్యంలో భాగంగానే ఈ వ్యవస్థను ఆస్పత్రిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 800కి పైగా రోబోటిక్ సర్జరీలు చేశామని.. ఇది దేశంలోనే ఒక రికార్డని చెప్పారు. తమ ఆస్పత్రికి సహకరిస్తున్న దాతలకు, బ్యాంకర్లకు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు రూ.10 కోట్ల ఖరీదైన ఈ అత్యాధునిక ఫోర్త్ జనరేషన్ రోబోటిక్ సర్జికల్ వ్యవస్థ ద్వారా రోగులకు నొప్పిలేని రీతిలో శస్త్ర చికిత్సలు చేయవచ్చని వైద్యులు వివరించారు.