Share News

గుట్ట ఆలయ ఈవోగా వెంకట్రావ్‌

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:14 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్‌ అధికారి ఎస్‌.వెంకట్రావ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం ఆదివారం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది.

గుట్ట ఆలయ ఈవోగా వెంకట్రావ్‌

యాదాద్రి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్‌ అధికారి ఎస్‌.వెంకట్రావ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం ఆదివారం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా జీఏడీ విభాగంలో ప్రొటోకాల్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌.వెంకట్రావ్‌ను దేవాదాయ శాఖ డైరెక్టర్‌, యాదగిరిగుట్ట దేవస్థాన ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్వర్వులు జారీచేసింది. ఈయన గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేశారు. డీఆర్డీవో పీడీగా, జాయింట్‌ కలెక్టర్‌గా, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

దేవస్థాన ఈవోగా ఐఏఎస్‌ అధికారి

ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తరహాలో ప్రత్యేక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రత్యేక మండలిని ఏర్పాటు చేసి, ఆలయ ఈవోగా ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ప్రభుత్వం యోచించింది. ఈ మేరకు ప్రభుత్వం అడుగులు వేసింది. 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఎస్‌.వెంకట్రావ్‌ను ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 1940 నుంచి ఆలయానికి దేవాదాయ శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్‌, జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులు.., రెవెన్యూ శాఖ నుంచి డిప్యూటీ కలెక్టర్‌, ప్రస్తుతం స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎ.భాస్కర్‌రావు ఈవోగా సేవలందిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న భాస్కర్‌రావుకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. మండలి ఏర్పాటు చేసిన పక్షంలో గుట్ట ఆలయ పరిపాలన పూర్తిగా ప్రక్షాళన కానుంది. ఐఏఎస్‌ అధికారి ఈవోగా నియమించిన పక్షంలో విద్యుత్‌తోపాటు పలు శాఖలకు ఎస్‌ఈ స్థాయి అధికారులు రానున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:14 AM