Share News

నిరుపయోగంగా అద్దె గదులు!

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:24 PM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్ర దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. వీరికోసం పాతఆచారాల పునరుద్ధరణ పేరుతో సదుపాయాలు కూడా ఒక్కొక్కటిగా కొండపైన సమకూరుతున్నాయి.

 నిరుపయోగంగా అద్దె గదులు!
ఆండాళ్‌ నిలయంలో మూతపడిన దేవస్థానం అద్దె గదులు

ఏడాది ముందే చేతులెత్తేసిన టెండరుదారుడు

అసౌకర్యాలతో గదులు

పట్టించుకోని ఆలయ అధికారులు

యాదగిరిగుట్ట, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్ర దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. వీరికోసం పాతఆచారాల పునరుద్ధరణ పేరుతో సదుపాయాలు కూడా ఒక్కొక్కటిగా కొండపైన సమకూరుతున్నాయి. కొండకింద పాతబస్టాండ్‌ ఎదురుగా భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించిన అద్దె గదుల విషయంలో మాత్రం దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. టెండరుదారుడు వేలం పాట అధికంగా నిర్వహించడంతో అద్దె చెల్లించలేక చేతులెత్తేశారు. దేవస్థానం అద్దె గదుల నిర్వహణ పట్టించుకోక నిరుపయోగంగా మారి భక్తులకు గదుల కొరత ఎదురవుతోంది. కొండకింద కుల సత్ర భవనాల అద్దె గదుల వ్యాపారానికి దేవస్థానం అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

రహదారి వెంట అద్దె గదులు

బస్టాండ్‌ ఎదురుగా హైదరాబాద్‌ ప్రధానరహదారిపై నిర్మించిన ఆండాళ్‌ నిలయం భవనాలు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గోడలకు మర్రి, రావి చెట్లు మొలుస్తున్నాయి. 24 అద్దె గదులు, కింది భాగంలో 56 దుకాణ సముదాయాలు, 4 హాళ్లు ఉన్నాయి. భక్తులు అందుబాటులో ఉండేలా మూడేళ్ల (2023 మార్చి 20 నుంచి 2026 మార్చి 19 వరకు) కాలపరిమితితో టెండరు నిర్వహించారు. కాలక్రమేణా అద్దె అధికమై నష్టాలు వస్తున్నాయంటూ టెండరుదారుడు ఈ ఏడాది మార్చి నెలలో ఏడాది ముందుగానే టెండరుదారుడు దేవస్థానానికి అప్పగించాడు. నాటి నుంచి నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులకు గదుల వసతి లేకుండాపోయింది.

జీఎస్టీతో రూ.42లక్షల వేలం

అద్దె గదులు సుమారు రూ.36లక్షల వేలం పాటలో టెండర్‌దారుడు దక్కించుకోగా రూ.6 లక్షల జీఎస్టీతో కలిపి రూ.42లక్షలు చెల్లించాల్సి వచ్చింది. సుమారు రెండేళ్ల పాటు టెండరుదారుడు గదులు నిర్వహణ బాధ్యత వహించి 2025 మార్చిలో దేవస్థానానికి అప్పగించారు. ఐదు నెలలు కావస్తున్నా గదుల తాళం తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. పాతగుట్ట దేవస్థానం పరిధిలో కూడా 10 అద్దె గదులు నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని అధికారుల దృష్టికి తీసుకుపోగా కొత్తగా ఫంక్షనహాల్‌ నిర్మించేందుకు యోచిస్తున్నామని సమాధానమిచ్చారు. సిబ్బంది కొరత అంటూ దాటవేస్తూ భక్తుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. పట్టణంలో పలు కులసంఘాల భవనాలు వెలిశాయి. పట్టణంలో అనువుగా దేవస్థానానికి చెందిన ఆండాళ్‌ నిలయం అద్దె గదులు అందుబాటులో ఉన్నప్పటికీ అలంకారప్రాయంగా మారాయి.

గదుల్లో సౌకర్యాల లేమి

రెండు భవనాల్లో కలిపి భక్తులకు అద్దెకు ఇచ్చేందుకు 24 గదులు ఉన్నాయి. ఏ ఒక్క గదిలో సౌకర్యాలు సరిగా లేవు. ఒక్కో గదిలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు, తలుపులు, నల్లాలు, స్విచ బోర్డులు పూర్తిగా ధ్వంసమై ఒక్కో తీరుగా గదుల పరిస్థితి ఉంది. కాంప్లెక్స్‌ వెనకాల గోడలకు మొక్కలు మొలిచాయి. వీటి స్థానంలో అవసరం ఉన్నచోట మరమ్మతులు చేసి గదులు అందుబాటులోకి తెస్తే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తాం

ఈ ఏడాది మార్చి నెల నుంచి రెండు పర్యాయాలు టెండర్లు ఆహ్వానించినా ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం దేస్థానం ఆధ్వర్యంలోనే అద్దె గదుల నిర్వహణ చేసేందుకు బాధ్యత తీసుకుంటాం. క్షేత్ర దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మరమ్మతులు చేయించి అద్దె గదులు అందుబాటులోకి తెస్తాం. పాతగుట్ట వద్ద అద్దె గదులు శిథిలావస్థలో ఉన్నాయి. వాటి స్థానంలో ఫంక్షన హాల్‌ నిర్మించాలని యోచిస్తున్నాం.

దోర్భల భాస్కరశర్మ, ఏఈవో, యాదగిరిగుట్ట దేవస్థానం

Updated Date - Jul 30 , 2025 | 11:24 PM