Share News

అకాల వర్షం..తడిసిన ధాన్యం

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:47 AM

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం రాశులు తడిసి పోయాయి.

 అకాల వర్షం..తడిసిన ధాన్యం
వలిగొండ మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యం

ఆందోళనలో రైతులు

చౌటుప్పల్‌ టౌన, సంస్థాన నారాయణపురం, వలిగొండ, భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం రాశులు తడిసి పోయాయి. తూకాలకు సిద్దం చేసిన ధాన్యం తడిసి పోవడంతో రైతులు అల్లాడిపోయారు. సీసీ కల్లం పై పోసిన రాశుల కిందకు వర్షపు నీరు చేరడంతో ధాన్యం తడిసింది. స్థలం రిజర్వు కోసం సీసీ కల్లంపై పలుచగా పోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. సీసీ కల్లం పై పోసిన 25 రాశుల కిందకు నీరు చేరగా, అందులో 15 రాశుల కు చెందిన ధాన్యం ఎక్కువగా తడిసి పోయింది. ఐదారు ప్రాంతాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. మార్కెట్‌ యార్డుకు తెచ్చిన 186 మంది రైతులకు చెందిన ధాన్యంలో 42 మంది రైతుల ధాన్యం తూకం వేశారు. తూకాలు వేసిన 12,172 బస్తాల ఽలో 754 బస్తాల ధాన్యాన్ని లిప్ట్‌ చేయకపోవడంతో వర్షానికి తడిసి పోయింది. ఏఎంసీ చైర్మన ఉబ్బు వెంకటయ్య, తహసీల్దార్‌ హరికృష్ణ, ఏఎంసీ సెక్రటరీ రవీందర్‌రెడి యార్డులో పర్యటించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. సంస్థాన నారాయణపురం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం వర్షం పడడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులు ధాన్యం తడవకుండా నానాపాట్లు పడ్డారు. వర్షానికి కొంత మేర ధాన్యం తడిసింది. అకాల వర్షం అన్నదాతలలో అనునిత్యం ఆందోళన రేకెత్తిస్తుంది. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ధాన్యం తడుస్తుందో అన్న ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. వలిగొండ మండలంలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కురిసిన వర్షానికి రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించి, ఆరబెట్టిన వరి ధ్యానం తడిచింది. తడిసిన ధ్యానాన్ని రైతులు ఆరబెట్టి పట్టాలు, కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు. భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఆదివారం కురిసింది. నమాతపల్లి గ్రామ శివారులోని పూర్ణగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ సమీపంలో గల తాటిచెట్టుపై పిడుగుపడింది. మండలంలో ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొంత మేర తడిసింది. అయితే రైతులు ముందస్తుగా ధాన్యం రాసులపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పుకోవడంతో నష్టనివారణ జరిగింది.

Updated Date - Apr 28 , 2025 | 12:47 AM