Share News

వీధికుక్కలతో పరేషాన

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:52 PM

జిల్లా కేంద్రం భువనగిరి పట్టణ ప్రజలను వీధి కుక్కలు భయపెడుతున్నాయి.

వీధికుక్కలతో పరేషాన

భువనగిరి టౌన, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం భువనగిరి పట్టణ ప్రజలను వీధి కుక్కలు భయపెడుతున్నాయి. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లినా, బైకులపై వెళ్లినా వీధి కుక్కల గుంపు భౌ భౌ అని బిగ్గరగా భయపడేలా అరుస్తూ వెంటాడుతున్నాయి. దీంతో విద్యార్ధులు పాఠశాలలకు వెళ్లేందుకు జంకుతున్న పరిస్థితి. పలువురు మహిళలు మార్నింగ్‌ వాక్‌ మానివేశారు. పలువురు వీధి కుక్కల దాడిలో గాయపడుతూ రేబిస్‌ ఇంజక్షన్స కోసం ఆస్పత్రుల బాటపడుతున్నారు. మరికొందరు కాళ్లు, చేతులు విరిగి నెలల తరబడి బెడ్‌కు పరిమితమవుతున్నారు. దీంతో తాము ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందుల్లో వీధి కుక్కల సమస్య మొదటిదిగా పలువురు పేర్కొంటుండటం కుక్కల సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. వీధి కుక్కల అదుపునకు వాటి పునరుత్పత్తిని నియంత్రించే లక్ష్యంతో రూ.45 లక్షల వ్యయంతో పట్టణ శివారులోని హన్మాపూర్‌లో నిర్మించిన జంతువుల శస్త్రచికిత్స కేంద్రం ఆర్భాటానికే పరిమితమయింది. దీంతో వీధి కుక్కల నియంత్రణపై అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమైన పరిస్థితి. వీధి కుక్కల విజృంభన ఇలాగే కొనసాగితే సమీప కాలంలో మరింత భయంకరమైన పరిస్థితులు నెలకొంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వీధి కుక్కల నియంత్రణకు చిత్తశుద్ధి చూపాలని కోరుతున్నారు.

మార్నింగ్‌ వాక్‌ మానివేశాం

ఇంటి నుంచి బయటకు రావాలంటే వీధి కుక్కలు భయపెడుతున్నవి. ఇంటి ముందే గుంపుగా ఉంటూ బయటకు రాగానే బిగ్గరగా అరుస్తున్నాయు. వీటి భయంతో నాతో పాటే పలువురు మహిళలు కూడా మార్నింగ్‌ వాక్‌ మానివేశారు. పిల్లలు ఇంటి ముందు ఆడుకోలేని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.

-ఉదయగిరి జ్యోతి, పోచమ్మవాడ.

వీధి కుక్కలను నియంత్రిస్తాం

వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. వీధి కుక్కల పునరుత్పత్తి నియంత్రణకు జంతు జనన నియంత్రణ కేంద్రంలో శస్త్ర చికిత్సలు నిర్వహించేలా సంబంధిత ఏజెన్సీతో ఇటీవలే మాట్లాడాం. త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తాం. క్రమేపీ వీధి కుక్కల సంఖ్యను తగ్గిస్తాం.

- జి.రామలింగం, మునిసిపల్‌ కమిషనర్‌, భువనగిరి

Updated Date - Jul 29 , 2025 | 11:53 PM