ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమే లక్ష్యం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:32 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను ఈ నాలుగేళ్లలోనే పూర్తిచేసి తీరుతామని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

80 ఏళ్ల కల డిండి ఎత్తిపోతల ద్వారా నెరవేరుతుంది :ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నాం : మంత్రి వెంకటరెడ్డి
నల్లగొండ నియోజకవర్గంలో రూ.36 కోట్ల తో మూడు లిఫ్టులకు శంకుస్థాపన
కలెక్టరేట్ వద్ద బహిరంగసభ
తరలివచ్చిన ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.
నల్లగొండ, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను ఈ నాలుగేళ్లలోనే పూర్తిచేసి తీరుతామని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో రూ.46.25 కోట్ల అంచనావ్యయంతో చేపడుతున్న బక్కతాయికుంట, పొనుగోడు, నర్సింగ్‌భట్ల ఎత్తిపోతల పథకాలకు, రూ.36కోట్ల అంచనావ్యయంతో నిర్మించతలపెట్టిన కలెక్టరేట్ అదనపు బ్లాక్ నిర్మాణానికి సోమవారం రోడ్లు, భవనాలశాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రుల పర్యటన సందర్భంగా నల్లగొండలో మంత్రులతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రులిద్దరూ ఓపెన్‌టా్‌ప కారులో నిలబడి ర్యాలీలో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఇదే సభావేదికనుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో అయిదుగురు లబ్ధిదారులకు సోమవారం రూ.లక్ష విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమాల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, ఎస్పీ శరత్ చంద్రపవార్, అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రాజ్‌కుమార్, ప్రాజెక్టుల సీఈ అజయ్‌కుమార్, ఈఈ గంగం శ్రీనివా్‌సరెడ్డి, జవహర్, డీఆర్‌వో అశోక్‌రెడ్డి, మునిసిపల్ మాజీ ఛైర్మన్ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్ పట్టణఅధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు.
భారీ ప్రదర్శనగా మంత్రుల ర్యాలీ
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల నిమిత్తం జిల్లాకేంద్రంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ శ్రేణులు నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. కార్లతోపాటు, బైక్‌లతో ఈ ర్యాలీలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మంత్రులిద్దరూ ఓపెన్‌టా్‌ప కారులో నిలబడి కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉత్సాహపరుస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. జైకాంగ్రెస్, జై కోమటిరెడ్డి నినాదాలతో ర్యాలీలో కార్యకర్తలు సందడి చేశారు. మునిసిపల్ మాజీ ఛైర్మన్ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, నాయకులు లక్ష ్మయ్య, అబ్బగోని రమేష్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
నాలుగేళ్లలో ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం :ఉత్తమ్
బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గాన్ని కూడా ఈ టర్మ్‌లోనే పూర్తిచేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. అక్కడ జరిగిన ప్రమాదంతో తాత్కాలిక ఇబ్బందులను అధిగమించి పనులు చేయిస్తామన్నారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో 80ఏళ్లుగా ఎదురుచూస్తున్న డిండి ఎత్తిపోతలకు నీరందించే ఏదుల-డిండి పథకానికి రూ.1800కోట్లతో తమ ప్రభుత్వం టెండర్లు పిలిచి, పనులు చేపడుతోందన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అవసరమైన ఎత్తిపోతల పథకాలన్నింటికీ నిధులు మంజూరు చేసి పనులు చేపడతామన్నారు. మంత్రి వెంకటరెడ్డి అయిదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని, మరో పర్యాయం ఎంపీగానూ పనిచేశారన్నారు. ఆయన నల్లగొండ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రూ.700కోట్లతో రింగ్‌రోడ్డు, లతీ్‌ఫసాబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టలపైకి ఘాట్‌రోడ్లు, రోప్‌వేల నిర్మాణాల పనులు శరవేగంగా సాగుతుండడం గమనించానని తెలిపారు. మంత్రి వెంకటరెడ్డి కోరిక మేరకు ఏఎమ్మార్పీ హైలెవల్ కాల్వ లైనింగ్ ప్రాజెక్టుకు రూ.442 కోట్ల నిధులు మంజూరుచేశామని, త్వరలో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. గుండ్లపల్లి-ఉదయసముద్రం పథకానికి రూ.92 కోట్లు, భీమసముద్రం-చర్లపల్లి ప్రాజెక్టుకు రూ.26కోట్ల నిధులతో ప్రతిపాదనలు అందాయని, వాటిని కూడా మంజూరుచేస్తామని ప్రకటించారు. బునాదిగానికాల్వ, పిలాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డిపల్లి కాల్వలకు రూ.500కోట్లతో నిధులు మంజూరు చేయగా, పనులు మొదలయ్యాయని, ఎమ్మెల్యేలు రోజూ పనులు పర్యవేక్షించి సకాలంలో పూర్తయ్యేలా సమీక్షలు చేయాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. రైతులంతా ప్రాజెక్టులు, కాల్వలకు భూసేకరణ విషయంలో సహకరించాలని మంత్రి కోరారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోరిన మేరకు శివన్నగూడెం నుంచి సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు లిఫ్టు చేపట్టాలనే ప్రతిపాదనలకు నిధులిస్తామని, త్వరలో టెండర్లు చేపడతామని ప్రకటించారు. నకిరేకల్ ఎమ్మెల్యే కోరిక మేరకు అయిటిపాముల ఎత్తిపోతల పథకం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచనమేరకు దున్నపోతుల గండి సహా నాలుగు ఎత్తిపోతల పథకాలను పూర్తిచేస్తామన్నారు. ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి కోరిన ప్రకారం న నెల్లికల్లు ఎత్తిపోతల పథకం మొదటిదశను వేగంగా పూర్తిచేస్తామన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ కోరికమేరకు పెండ్లిపాకల రిజర్వాయర్ పూర్తిచేస్తామని, కాచవరం, చింత్రియాల, రాములోరిబండ లిఫ్టులు పూర్తిచేస్తామని ప్రకటించారు. తుంగుతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు 15 ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరారని, వాటన్నింటినీ ఆమోదించి నిధులిప్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా దేవాదుల మూడోదశ నుంచి తుంగతుర్తికి నీళ్లిచ్చే రూ. 1000కోట్ల పథకాన్ని ఆమోదిస్తామన్నారు. బీర్ల అయిలయ్య పేర్కొన్న ప్రకారం గంధమళ్ల రిజర్వాయర్ మంజూరుచేసి పనులు పూర్తిచేయిస్తామన్నారు. అదేవిధంగా ఎంపీ కిరణ్‌రెడ్డి ప్రతిపాదించిన రాచకాల్వ లైనింగ్ చేపడతామని, శాలిగౌరారం కాల్వల లైనింగ్, కేతిరెడ్డిపల్లి కాల్వ లైనింగ్ చేపడతామన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సహకారంతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నామని, తాము పదవులు అలంకారం కోసం చేయడం లేదని, మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి ప్రతిరోజూ 24గంటలు కష్టపడి పనిచేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా ప్రగతికి ఎవరు ఏమూల నుంచి వచ్చినా తాము పనులు చేస్తామని, వారి సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
అర్థం లేకుండా మాట్లాడుతున్నారు : మంత్రి కోమటిరెడ్డి
తాము తల్చుకుంటే వరంగల్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించిన సభకంటే నాలుగురెట్ల సభను నల్లగొండలో పెట్టగలమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని, మేం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో దాదాపు అయిదునెలలు ఎన్నికల కోడ్ వచ్చిందని, మిగిలిన 11 నెలల్లోనే తాము ఇన్ని పను లు చేసినందుకు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు. ఉమ్మడిజిల్లాలో రూ.1600కోట్లతో ఇప్పటికే రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరుచేశామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను బీఆర్‌ఎస్ పదేళ్లలో పడావు పెట్టిందన్నారు. మళ్లీ కాంగ్రెస్ వచ్చాకే ఈ పథకం పనులు ప్రారంభమయ్యాక కేసీఆర్ కళ్లుపడడంతోనే అక్కడ ప్రమాదం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు చేసేందుకు అవసరమైన బేరింగ్‌కోసం అమెరికా వెళ్లి ఆర్డర్ ఇచ్చి తెప్పించామన్నారు. ప్రస్తు తం ఆ బేరింగ్‌ను మిషన్‌లో అమరుస్తున్నారు. వారం పదిరోజుల్లో ఒకవైపున పనులు ప్రారంభమవుతాయని, బ్రాహ్మణ వెల్లంల పథకం కింద కాల్వ ల పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే వానాకాలానికి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క నెల లో అయినా ఒకటోతేదీన ఉద్యోగులకు వేతనాలిచ్చిన పరిస్థితి ఉందా..? అని నిలదీశారు. తాము ఉద్యోగులకు, పింఛన్‌దారులకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలందిస్తున్నామని తెలిపారు. పేదలకు ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను కట్టించే ప్రక్రియ మొదలైందని, రాజీవ్ యువ వికాసం కింద యువకులకు స్వయం ఉపాధి కింద రూ.5లక్షలు ఇస్తామని, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు ఇస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూసీ కాల్వలకు, ఎత్తిపోతల పథకాలకు, గంధమళ్ల రిజర్వాయర్‌ను చేపట్టి పూర్తిచేస్తామన్నారు. కలెక్టరేట్ భవనాన్ని అన్ని హంగులతో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రూ. 35కోట్లతో అదనపు బ్లాక్‌ని నిర్మిస్తున్నామని చెప్పారు.
అదనపు బ్లాక్ నిర్మాణంతో ఉద్యోగులకు వెసులుబాటు : కలెక్టర్
ఉద్యోగులు ఇంటి కంటే ఎక్కువ సమయం ఉద్యోగానికే కేటాయిస్తుంటారని, అలాంటివారు పనిచేసే చోట వసతులు, సదుపాయా లు బాగుండాలనే సదుద్దేశంతో కలెక్టరేట్‌లో 82వేల చదరపు అడుగుల అదనపు బ్లాక్ నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకురావడం అభినందనీయమని, ఇందుకు నిధులు మంజూరు చేసిన మంత్రికి కృతజ్ఞతలు అని కలెక్టర్ ఇలాత్రిపాఠి అన్నారు. జిల్లా అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల అమలుకు అధికారయంత్రాంగం కృషి చేస్తోందని, ఏసీలలో ఉండకుండా ప్రజాక్షేత్రంలో ఉండి అందరం పనిచేద్దామన్నారు. తాను బాధ్యతలు చేపట్టాక స్వల్పకాలంలోనే బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు అవసరమైన 737 ఎకరాల భూ మిని సేకరించామని, ఈప్రాజెక్టుతో 97వేల ఎకరాలకు సాగునీరొస్తుందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి క్రిటికల్ కేర్‌యూనిట్‌ను నల్లగొండ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఉద్యోగులంతా చిత్తశుద్దితో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లా అభివృద్ధికి అధికారులంతా సహకరించాలి : ఎంపీ రఘువీర్‌రెడ్డి
జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు, ఉద్యోగులంతా సహకరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల సంక్షేమం కోసం, రాష్ట్ర అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. వాటన్నింటినీ అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారయంత్రాంగం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న నల్లగొండలో సకలసౌకర్యాలతో కలెక్టరేట్ అదనపు భవనం నిర్మించతలపెట్టడం అభినందనీయం.
జిల్లా ప్రగతికి అందరూ సహకరించాలి : ఎమ్మెల్సీ శంకర్‌నాయక్
జిల్లాని ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భూభారతితో రైతతుల సమస్యలు తీరుతున్నాయి. ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో పలు సంక్షేమ, అభివృద్ధి పనులు చేపడుతూ జజిల్లాని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. అందరికీ అభినందనలు.
నల్లగొండ నాయకులెవరూ సామాన్యులు కాదు : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలంటే సామాన్యులు కాదు. అసాధ్యాలని సుసాధ్యం చేయగల ఽవాళ్లే. క్షేత్రస్థాయిలో బలమున్న నేతలు. నిరంతరం జిల్లా ప్రగతి కోసం మేమంతా తాపత్రయపడుతున్నాం. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి సీఎం స్థాయి వ్యక్తులు, గత ప్రభుత్వంలో మంత్రి కనీసం సీఎం వద్ద మాట్లాడగలిగేవారా.. ఆలోచించాలి. జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగగా పనిచేద్దాం. అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కలెక్టరేట్‌లో అదనపు భవనం నిర్మించడం అభినందనీయం.
డిండి ప్రాజెక్టు వస్తుందని ఊహించలేదు: ఎమ్మెల్యే బాలునాయక్
వెనకబడిన దేవరకొండ నియోజకవరర్గాన్ని సస్యశ్యామలం చేసే పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేస్తుంది. డిండి ప్రాజె క్టు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలకు నిధులిచ్చారు. అదేవిధంగా ఆర్డీవో కార్యాలయం, తహసీల్ధార్‌కార్యాలయాలు, రోడ్ల నిర్మాణాలకు నిధులివ్వాలని కోరుతున్నాం. అందరి సహకారంతో జిల్లాని అగ్రపథాన నిలుపతాం.
సన్నబియ్యం పథకం అమలు సాహసోపేత నిర్ణయం: ఎమ్మెల్యే వీరేశం
రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేయడం దేశంలోనేసాహసోపేత నిర్ణయం. దేశానికే ఆదర్శంగా ఈ పథకం నిలిచింది. ఇదే కాకకుండా పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో జిల్లాని, తతెలంగాణ రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిపేందుకు మంత్రులు కృషి చేస్తున్నారు. నల్లగొండ జిల్లాని గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా అన్నిరంగాల్లో ముందుకెళుతోంది.