నెంబరు ప్లేట్ మారిస్తే కుదరదు
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:51 AM
వాహనాలన్నింటికీ హెచ్‌ఎ్‌సఆర్సీ (హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్) బిగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. వాహనాలను కొనుగోలు చేసిన నెలరోజుల్లోపు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

వాహనాలన్నింటికీ హెచ్‌ఎ్‌సఆర్సీ ఉండాల్సిందే
పాత వాహనాలన్నింటికీ బిగించేందుకు సన్నాహాలు
సెప్టెంబరు 30వరకు గడువువిధించిన కేంద్ర ప్రభుత్వం
టెంపరరీ రిజిస్ట్రేషన్ వాహనాలపై దృష్టి
వివరాలు సేకరిస్తున్న అధికారులు
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : వాహనాలన్నింటికీ హెచ్‌ఎ్‌సఆర్సీ (హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్) బిగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది. వాహనాలను కొనుగోలు చేసిన నెలరోజుల్లోపు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేని పక్షంలో ఆ తరువాత నెలవారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది టెంపర రీ (తాత్కాలిక) రిజిస్ట్రేషన్ నెంబర్‌తోనే ఏళ్లుగా కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా నెంబ ర్ ప్లేట్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. దీనికి చెక్‌పెట్టేందుకు రవాణాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
జిల్లాలోని కొంతమంది వాహనదారులు ఏళ్లుగా టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తోనే గడిపేస్తున్నారు. మరికొంతమంది వాహనాలు ఇతరుల వద్ద కొనుగోలు చేసి వారి పేరున బదిలీ చేసుకోవడం లేదు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు విచారణ లో వాహనానికి సంబంధించిన ఆర్సీలను పరిశీలిస్తే, వాహనం నడిపేది ఒకరైతే, రిజిస్ట్రేషన్ మరొకరి పేరు తో ఉంటోంది. పాత వాహనాలకు సాధారణ నంబర్ ప్లేట్లు ఉంటున్నాయి. అయితే పాత, కొత్త తేడా లేకుం డా వినియోగించే వాహనం ఏదైనా విధిగా హైసెక్యురిటీ నెంబర్ ప్లేట్ ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పాత నెంబర్లు ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లు మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు కేంద్రం గడువు విధించింది. దీంతో రవాణాశా ఖ అధికారులు జిల్లాలో మొత్తం పాత వాహనాలు ఎన్ని, కొత్తవి ఎన్ని అనే సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. అన్నింటికీ హైసెక్యూరిటీ నెంబర్ల ప్లేట్లను బిగించుకునేలా తగినకార్యచరణ రూపొందిస్తున్నారు.
జిల్లాలో మొత్తం 2.41లక్షల వాహనాలు
జిల్లాలో మొత్తం 2,47,911 వాహనాలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. వీటిలో మోటార్ సైకిళ్లు 1,56,031, ఆటోలు 11,657,మోటార్ కార్లు 26,904, మోటార్ క్యాబ్‌లు 1,780,మోపెడ్లు 1,429,ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు 610వరకు ఉన్నాయి. మ్యాక్సీ క్యాబ్‌లు 565, గుడ్స్ వాహనాలు 13,799, వ్యవసాయ వినియోగ వాహనాలు 12,856, వాణిజ్య వినియోగ వాహనాలు 5,202, ట్రాలీ వ్యవసాయానికి సంబంఽధించినవి 5,899, వాణిజ్యపర ట్రాలీలు 4,513వరకు ఉన్నాయి. కన్‌స్ట్రక్షన్ సామగ్రి ఉన్న వాహనాలు 742, మూడు చక్రాల గుడ్స్ 2,974, హార్వెస్టర్ ట్రాక్టర్లు 918, రిగ్ మౌంటెడ్ వాహనాలు 326, ఓమ్నీ బస్సులు 651తోపాటు ఇతర వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలన్నింటికీ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేటు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
హెచ్‌ఎ్‌సఆర్సీ లేని పక్షంలో...
వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేనిపక్షం లో చాలా సమస్యలు ఎదురవుతాయి. వాహనాలు ఇతరులకు విక్రయించడం సాధ్యం కాదు. రవాణాశాఖ, పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదవుతాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ జారీచేసేందుకు వీలుండదు. వాహనాన్ని ఇతరుల పేరున మార్చాలంటే రిజిస్ట్రేషన్ కుదరదు. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వాహనానికి, వ్యక్తులకు తగిన సహాయం అందదు. హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కోసం నిబంధనల ప్రకారం బైక్‌లకు రూ.320-రూ.380, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న బైక్‌లకు రూ.400-రూ.500, కార్లకు రూ.590-700, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లకు రూ.700-800, ఆటోలు, మూడు చక్రాల వాహనాలకు రూ.350-450, వాణిజ్య వాహనాలకు రూ.600-800వరకు చెల్లించాల్సి ఉంటుంది.
టెంపరరీ రిజిస్ట్రేషన్ వాహనాలపై దృష్టి
జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 2019 తర్వాత రిజిస్టర్ అయిన వాహనాలన్నింటికీ హెచ్‌ఎ్‌సఆర్సీ విధిగా బిగిస్తున్నారు. ఈ విషయంలో ఇబ్బందులు లేవు. దీనికంటే ముందు రిజిస్టర్ అయిన వాహనాలకే తాజా నిబంధనలు వర్తిసాయి. అలాగని కొత్త వాహన నంబర్ ప్లేట్ విరిగిందని సాధారణ ప్లేట్ ఏర్పాటు చేయడం కుదరదు. వాహనం ఏదైనా, ఎప్పటిదైనా విధిగా హెచ్‌ఎ్‌సఆర్సీ ఉండాల్సిందే.జిల్లాలోని రైతులు, ఇతరులు ట్రాక్టర్లు, వ్యవసాయ పనుల కోసం కొనుగోలు చేసే వాహనాలతో పాటు కొన్ని బైక్‌లు టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తోనే ఏళ్లుగా నడుస్తున్నాయి. మరోవైపు కొంతమంది హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ షోరూములకు వచ్చినా, వాటిని బిగింకోవడం లేదని అధికారులు గుర్తించారు. వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. చాలా కాలంగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పెండింగ్‌లో ఉన్న వాహనాలను గుర్తించి, రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వాహనదారులు ఏ చిరునామాలతో టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందనే అంశంపై సంబంధిత షోరూముల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలా కాలంగా రిజిస్ట్రేషన్ చేయించుకోని వాహనాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ పొందడం ఇలా..
హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ పొందాలంటే రవాణాశాఖ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వాహనదారులు ఎస్‌ఐఏఎం వెబ్‌సైట్ ఆధారంగా వీటిని పొందవచ్చు. ఈ వెబ్‌సైట్ పేజీని ఓపెన్ చే యగానే అందులో హెచ్‌ఎ్‌సఆర్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌ను ఎంచుకోవాలి. వాహన వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. వాటి ఆధారంగా తగిన రుసుము చెల్లించిన పక్షంలో నెంబర్ ప్లేట్ ఇంటికే వస్తుంది. దాన్ని వాహనానికి బిగించి ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. దీంతో హైసెక్యూరి టీ నెంబర్ పేట్లు ఎన్ని వాహనాలు పొందాయనే స మాచారం వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటుంది.
హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ బిగించుకోవాలి : సాయికృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి
జిల్లాలో 2019 ఏప్రిల్‌కు ముందు వాహనాలు కొనుగోలు చేసిన వారు హైసెక్యూరిటీ నెంబర్ పేట్ల్ బిగించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబరు 30వ తేదీ వరకు గడువు విధించింది. గతంలో వాహనాలు కొనుగోలు చేసిన వారితో పాటు కొత్త వాహనాలకు సంబంధించిన హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్‌లు విరిగిన పక్షంలో తప్పనిసరిగా బిగించుకోవాలి. హెచ్‌ఎ్‌సఆర్సీపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.