Share News

నీటి పన్ను వసూలు నీటి మాటలేనా?

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:09 AM

భువనగిరి పట్టణంలోని 11వ వార్డులో ఉన్న శ్రీగ్ద కాలనీ శ్రీమంతులు ఉండే ప్రాంతంగా పేరు. చిన్నపాటి ఇల్లు కూడా సుమారు రూ.కోటి ధర పలుకుతోంది. గజం ధర రూ.25వేల పైనే. భారీ భవంతులు, విశాలమైన రహదారులు, గ్రీనరీ, తదితర ఆధునిక హంగులతో పట్టణంలోనే మొట్టమొదటి గేటెడ్‌ కమ్యూనిటీ కాల నీ. 1918లో ప్రారంభమైన ఈ కాలనీలో సుమారు 60 వరకు ఇళ్లు ఉన్నాయి.

నీటి పన్ను వసూలు నీటి మాటలేనా?

నల్లా బిల్లుల బకాయి రూ.5.60కోట్లు

వసూలులో అధికారులు, చెల్లింపుల్లో యజమానుల నిర్లక్ష్యం

భువనగిరి పట్టణంలోని 11వ వార్డులో ఉన్న శ్రీగ్ద కాలనీ శ్రీమంతులు ఉండే ప్రాంతంగా పేరు. చిన్నపాటి ఇల్లు కూడా సుమారు రూ.కోటి ధర పలుకుతోంది. గజం ధర రూ.25వేల పైనే. భారీ భవంతులు, విశాలమైన రహదారులు, గ్రీనరీ, తదితర ఆధునిక హంగులతో పట్టణంలోనే మొట్టమొదటి గేటెడ్‌ కమ్యూనిటీ కాల నీ. 1918లో ప్రారంభమైన ఈ కాలనీలో సుమారు 60 వరకు ఇళ్లు ఉన్నాయి. పలువురు మునిసిపల్‌, ప్రభుత్వశాఖల అధికారులు ఈ కాలనీలోనే అద్దెకు ఉంటున్నారు. అంతాబానే ఉన్నా, ఈ కాలనీలోని నల్లా కనెక్షన్లన్నీ అక్రమమే. ఇక్కడి ఇం టి యజమానులు నల్లా బిల్లులను చెల్లించడాన్ని ఏళ్ల తరబడిగా విస్మరిస్తుండ గా, మునిసిపల్‌ అధికారులు కూడా అదే రీతిన వ్యవహరిస్తున్నారు. అలాగే ఇంటి నెంబర్‌ కేటాయించని, ఆస్తిపన్ను మదింపు జరగని భవనాలు కూడా ఈ కాలనీ లో ఉన్నాయి. నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణ, అసెస్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా మునిసిపల్‌ అధికారులు స్పందించడం లేదని కాలనీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కోశాధికారి వెల్లంకి పురుషోత్తంరెడ్డి తెలిపారు. అలాగే మునిసిపల్‌ సరఫరా చేస్తున్న నీటికి అదనంగా ప్రైవేట్‌ బోర్ల ద్వారా చేస్తున్న నీటి సరఫరా వ్యయాన్ని కాలనీ వాసులే భరిస్తున్నారని వారు చెబుతున్నారు.

భువనగిరి టౌన్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): నీటి సరఫరాలో కా స్త ఆలస్యం జరిగితే మునిసిపల్‌ సిబ్బందిపై ప్రతాపాన్ని చూపే ప్రజలు నల్లా బిల్లులను చెల్లించడాన్ని మాత్రం మరుస్తున్నారు. అ దే సమయంలో ఆస్తిపన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ తదితర పన్నులను జబర్దస్తీగా వసూలు చేస్తున్న మునిసిపల్‌ యంత్రాంగం నల్లా బిల్లుల ను మాత్రం విస్మరిస్తోంది. దీంతో భువనగిరి మునిసిపాలిటీలో రూ.5.60కోట్ల నల్లాబిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. అక్రమ నల్లా కనెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే బకాయి మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉంది.అభివృద్ధి నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడుతున్న మునిసిపల్‌ యంత్రాంగం పెండింగ్‌ నల్లా బిల్లులు, అక్రమ నల్లా కనెక్షన్ల ను క్రమబద్ధీకరిస్తే కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఏడాది క్రితం ఈ తరహా చేసిన ప్రయత్నంతో అప్పట్లో సుమారు రూ.80లక్షలకు పైగా పెండింగ్‌ చార్జీలు వసూలయ్యాయి. దీంతో జనరల్‌ ఫండ్‌ గలగలమనడంతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ పలు కారణాలతో అధికారులు వసూళ్ల స్పీడును తగ్గించడంతో భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి.

10,190 నల్లా కనెక్షన్లు

భువనగిరి మునిసిపాలిటీలో 35 వార్డుల్లో అధికారికంగా 10, 190 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. గృహస్థు నల్లా కనెక్షన్‌కు నెలకు రూ.100, వాణిజ్య కనెక్షన్లకు రూ.500 బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అపార్ట్‌మెంట్‌ కనెక్షన్లకు ప్రత్యే చార్జీలు ఉన్నా, ఆ దిశగా మునిసిపాలిటీ కనీస ప్రయత్నాలు కూడా చేయలేదని తెలిసింది. కాగా చార్జీల రూపంలో ఏటా డిమాండ్‌ రూ.1.25కోట్లుగా ఉంది అలాగే కృష్ణా జలాలను సరఫరా చేస్తున్న హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ (హెచ్‌ఎండబ్ల్యూఎ్‌స)కు నెలకు సుమారు రూ.15లక్షలు, ఏటా రూ.1.70కోట్లు చార్జీలుగా మునిసిపాలిటీ చెల్లించాల్సి ఉంది. సుమారు కోటి రూపాయల వరకు హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు భువనగిరి మునిసిపాలిటీ బకాయి పడింది. మునిసిపల్‌ యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగా ఏకంగా రూ.5.60కోట్ల నీటి బిల్లులు వసూలు చేయకపోవడంతో బకాయిలుగా పేరుకుపోయాయి. పట్టణ వ్యాప్తంగా సుమారుగా 2వేల అక్రమ నల్లా కనెక్షన్లు ఉంటాయని అంచనా. వాటన్నింటినీ గుర్తించి క్రమబద్ధీకరించగలిగితే మునిసిపాలిటీకి భారీగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా, నల్లా కనెక్షన్‌ పీరియడ్‌ ఆధారంగా రెండు కేటగిరీలుగా రూ.6వేలు, రూ.13వేలు చెల్లింపులతో కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని గతంలో కౌన్సిల్‌ తీర్మానం కూడా జరిగింది. కానీ, ఆ తీర్మానం ఆధారంగా క్రమబద్ధీకరణ జరిగిన నల్లాలు పదుల సంఖ్యలోనే ఉన్నట్టు సమాచారం.

నీటి నిర్వహణపై కొరవడిన ప్రణాళిక

వినియోగదారులు, రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా, నల్లాల ద్వారా నీటి సరఫరా నిర్వహణపై మునిసిపాలిటీకి ప్రణాళిక కొరవడింది. నీటి బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతోపాటు విలువైన నీరు వృథా అవుతోంది. సుమారు 15 ఏళ్ల క్రితం మునిసిపాలిటీలో నీటి నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ సైనిక్‌పురి రిజర్వాయర్‌ నుంచి విడుదలైన జలాలు, భువనగిరిలోని ట్యాంకులకు చేరిన మొత్తం, రికార్డుల ప్రకారం ఉన్న నల్లా కనెక్షన్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిని, వ్యయాన్ని లెక్కించగా, రెండింటిలోనూ భారీ తేడాలు ఉన్నాయి. ఇదే తరహాలో స్థానిక జలాల లెక్కల్లోనూ తేడాలు వచ్చాయి. లీకేజీలు, అక్రమ నల్లాలు, కుళాయిలకు ఆన్‌ ఆఫ్‌ లేకపోవడం, నీటి విడుదల సమయాన్ని పాటించకపోవడం, నల్లా బిల్లుల వసూలు లేకపోవడం తదితర కారణాలతో నో ప్రాఫిట్‌ నో లాస్‌ విధానంలో ఉండాల్సిన నీటి సరఫరా విభాగం మునిసిపాలిటీకి ఆర్థిక భారంగా మారింది. దీంతో సమస్య శాశ్వత పరిష్కారం, నిరంతర పర్యవేక్షణకు ఓ టెక్నికల్‌ బృందాన్ని ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదనలు పలు కారణాలతో పాటు అధికారుల బదిలీతో శాశ్వతంగా కనుమరుగయ్యాయి. 35 వార్డులకు ప్రత్యేక అధికారుల నియామకాలు పూర్తి కావడంతో నీటి బిల్లుల వసూలుపై మునిసిపల్‌ అధికారులు శ్రద్ధ చూపాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై మునిసిపల్‌ కమిషనర్‌ జి.రామలింగం, డీఈ కొండల్‌రావు స్పందిస్తూ నల్లా బిల్లుల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు.

Updated Date - Jul 30 , 2025 | 12:09 AM