ఆపద వస్తే అంతేనా?
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:22 PM
ఆర్టీసీ బస్సుల్లోని ప్రథమ చికిత్స పెట్టెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పేరుకే బాక్సులు ఏర్పాటుచేసినా అందులో ఔషధాలు ఉండటం లేదు.

ఆర్టీసీ బస్సుల్లోని ప్రథమ చికిత్స పెట్టెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పేరుకే బాక్సులు ఏర్పాటుచేసినా అందులో ఔషధాలు ఉండటం లేదు. ఏదైనా ఆపద తలెత్తితే వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులతో పాటు డ్రైవర్లు, కండక్టర్లకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ప్రథమ చికిత్స అందని పరిస్థితి దాపురించింది. గతంలో ప్రథమ చికిత్స పెట్టెల్లో అత్యవసర వైద్యం కోసం ఔషధాలు, ఇతర చిన్నచిన్న మెడికల్ సంబంధిత వస్తువులు ఉండేవి. రాను రాను ఆ పెట్టెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఏ బస్సులోనూ ప్రథమ చికిత్స పెట్టెల్లో ఔషధాలు లేవు.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్)
ఎంతోమంది ప్రయాణ సమయంలో అనారోగ్యానికి గురవుతుంటారు. పలు సందర్భాల్లో డ్రైవర్లు, కండక్టర్లు అనారోగ్యానికి గురై మృత్యువాతపడుతున్నారు. ఎక్కువగా డ్రైవర్లు విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గుండెపోటు వచ్చినప్పుడు వారికి ప్రథమ చికిత్స అందజేస్తే కొన్ని గంటలపాటు ప్రాణాపాయం నుంచి కాపాడి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. బస్సుల్లో అలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అం తేకాక బస్సుల్లో ఆపరిశుభ్రత నెలకొంది. ప్రతిరోజూ బస్సులను శుభ్రం చేయాల్సి ఉన్నా, చేయడంలేదు. దీంతో బస్సుల్లో ప్రయాణికుల దుస్తులు దుమ్ము, ధూళి, మట్టితో మాసిపోతున్నాయి. పలు బస్సులకు కిటికీలకు ఉండాల్సిన అద్దాలు లేక వర్షాకాలంలో ప్రయాణికులు తడుస్తున్నారు.
కానరాని మెడికల్ కిట్లు
బస్సులో డ్రైవర్ సీటు వెనకభాగంలో ప్రథమచికిత్సకు సంబంధించిన పెట్టెలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ అవి ఖాళీగా ఉంటున్నాయి. గతంలో మెడికల్ కిట్లు ఉండేవి. అందులో ప్రథమ చికిత్సకు సంబంధించిన దూది, అయోడిన్, బ్యాండేజ్, కట్టుదుస్తులతో పాటు ఇతర ఔషధాలు ఉండేది. ప్రస్తుతం కనీసం ప్రథమ చికిత్సకు సం బంధించిన ఎలాంటి ఔషధాలు ఉండడంలేదు. ప్రయాణికులకు ఏదైనా గాయమైనా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ఆర్టీసీ సంస్థ సిబ్బందితో పాటు ప్రయాణికులకు అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
ఔషధాల ఏర్పాటుపై దృష్టి సారిస్తాం
ఆర్టీసీ బస్సుల్లో అత్యవసర మందుల ఏర్పాటుపై దృష్టి సారిస్తాం. రవాణా సౌకర్యాలు మెరుగుపడడం, అత్యవసర సేవలందించే 108 అంబులెన్ ్సలు అందుబాటులోకి రావడంతో ప్రథమ చికిత్సకు సంబంధించిన ఔషధాల విషయంలో దృష్టి సారించలేకపోయాం. ప్రస్తుతం బస్సుల్లో ఔషధాలు ఉండడంలేదు. సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదించి అత్యవసర సమయంలో వినియోగించే ఔషధాలను అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతాం.
జానరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం, నల్లగొండ