చౌటుప్పల్‌లో నాలుగు ‘మార్కెట్ యార్డులు’
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:13 AM
చౌటుప్పల్ మండలంలో వస్తున్న ధాన్యం దిగుబడిని పరిగణనలోకి తీసుకొని నాలుగు ప్రాంతాల్లో మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్ టౌన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్ మండలంలో వస్తున్న ధాన్యం దిగుబడిని పరిగణనలోకి తీసుకొని నాలుగు ప్రాంతాల్లో మార్కెట్ యార్డులను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వర్షానికి తడిసిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. రైతులు తెచ్చే ధాన్యానికి మార్కెట్ యార్డు స్థలం సరిపోవడం లేదని, అందుకనుగుణంగా మార్కెట్ యార్డుల ఏర్పా టుపై దృష్టి సారించినట్లు తెలిపారు. గోదావరి, కృష్ణాజలాలను రప్పించి ఈ ప్రాంతంలోని సాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని, ఈ జలాలతో ప్రతీ ఎకరం సాగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న ట్లు వివరించారు. దీంతో ధాన్యం దిగుబడి ఊహించనంతగా పెరుగుతుందని, అందుకనుగుణంగా మార్కెట్ యార్డులను నిర్మించాల్సి ఉందన్నారు. ఆదివారం కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యం వివరాలను ఎమ్మెల్యేకు తహసీల్దార్ హరికృష్ణ వివరించారు. మండలంలో నాలుగు మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ భూములను గుర్తించి సర్వే చేయించాలని తహసీల్దార్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. స్థానిక మార్కెట్ యార్డుకు చెందిన భూమిని సర్వే చేసి రెండు, మూడు రోజుల్లో సమగ్ర నివేదికను తనకు అందజేయాన్నారు. యార్డులోని నాబార్డు గోదాంలను మినహాయించి మిగిలిన ఇతర నిర్మాణాలను తొలగించాలని, కొత్తగా అవసరమైన నిర్మాణాలతోపాటు రైతులకు సౌకర్యాలను కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఏఎంసీ సెక్రటరీ రవీందర్‌రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కాంగ్రెస్ మునుగోడు అసెంబ్లీ ఇన్‌చార్జి పబ్బు రాజు, మునిసిపల్ మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఏవో నాగరాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుర్వి నర్సింహగౌడ్, సీతారామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ బి.మురళీ, పీఏసీఎస్ సెక్రటరీ వై.రమేష్, ఏఎంసీ డైరెక్టర్లు చప్పిడి సంజీవరెడ్డి, ఎండీ గౌస్, పబ్బు శ్రీకాంత్, బోయ వెంకటేశ్ పాల్గొన్నారు.