అనధికార సెలవులకు స్వస్తి
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:32 AM
ప్రభుత్వ పాఠశాలల్లో అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు ఇక దొరికిపోనున్నారు. సెలవు పెట్టకుండా కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాలకు రావడం, వెళ్లడం జరుగుతోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు ఇక దొరికిపోనున్నారు. సెలవు పెట్టకుండా కొంతమంది ఉపాధ్యాయులు పాఠశాలకు రావడం, వెళ్లడం జరుగుతోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల హాజరులో పారదర్శకత లోపించింది. ఈ క్రమంలో తీసుకువచ్చిన వేలిముద్రల విధానం కూడా ఫలితాలనివ్వకపోవడంతో ముఖగుర్తింపు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో ఉపాధ్యాయులు సమయపాలనతో పాటు వాస్తవ సంఖ్యకు మించి విద్యార్థులను చూపిస్తూ మధ్యాహ్న భోజనంలో సాగుతున్న అక్రమాలకు ఇక అడ్డుకట్టపడినట్లేనని అనుకుంటున్నారు.
- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట (కలెక్టరేట్)
ఏడాది నుంచి విద్యార్థుల హాజరును ముఖగుర్తిం పు ద్వారానే అమలుచేస్తున్నారు. ఉపాధ్యాయుల హాజరును కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో నూతన విధానంలో అమలుచేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో అమలుచేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే ఉపాధ్యాయులు వారి ఫోన్లలో సంబంధిత యాప్‌ను రిజిస్ట్రేషన చేసుకున్నారు. ముఖగుర్తింపు ద్వారా నమోదయ్యే విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలు ఆన్‌లైన్ ద్వారా స్కూల్ కాంప్లెక్స్, మండల విద్యాశాఖాధికార్యాలయం, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంతో పాటు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లనున్నాయి.
జిల్లాలో 881 పాఠశాలల్లో అమలు
జిల్లాలోని 881 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ముఖ గుర్తింపు విధానం ద్వారా విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరును నమోదు చేస్తున్నారు. అన్ని స్థాయిల్లోని ఉపాధ్యాయులతో ఉపాధ్యాయేతర సిబ్బంది కలిపి 4,542 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ పాఠశాల పనిదినాల్లో ఉదయం సమయంలో ఒకసారి, పాఠశాల ముగిసే సమయంలో మరోసారి ముఖగుర్తింపు ద్వారా హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంది. కాగా జిల్లాలో ఇప్పటివరకు 2,689 మంది ఉపాధ్యాయులు ముఖగుర్తింపునకు సంబంధించిన యాప్‌ను రిజిస్ట్రేషన చేసుకుని హాజరు నమోదుచేశారు. ఇంకా మిగిలిన వారు సోమవారం నమోదు చేసుకునే అవకాశముంది.
అనధికారంగా గైర్హాజరయ్యే పంతుళ్లకు...
ప్రభుత్వ పాఠశాలల్లో ముఖగుర్తింపు హాజరు విధానంతో అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయుల ఆటలు ఇక చెల్లవు. మారుమూల ప్రాంతాల్లోని పలు పాఠశాలల్లో విధులు నిర్వహించే కొంతమంది ఉపాధ్యాయులు సరిగ్గా విధులు నిర్వహించడం లేదు. వారి సమయపాలన లేకుండా పాఠశాలకు రావడం, వెళ్లడం చేస్తున్నారు. కొంతమంది.. ఉపాధ్యాయులు సెలవులు పెట్టకుండా గైర్హాజరవుతున్నారు. మరుసటి రోజు హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారు. ఇలాంటి విధానాలకు ముఖగుర్తింపు ద్వారా స్వస్తి చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఉదయం పాఠశాల సమయంలో ఒకసారి, సాయంత్ర పాఠశాల ముగిసిన తర్వాత మరోసారి వారి ఫోన్లలో రిజిస్ట్రేషన చేసుకున్న యాప్‌లో హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో గైర్హాజరైతే ఖచ్చితంగా దొరికేపోయే అవకాశం ఉంది.
పాఠశాలలకు జియోట్యాగింగ్
జిల్లాలోని అన్ని ప్రభుత్వపాఠశాలలకు జియో ట్యాగింగ్ చేశారు. తాజాగా ఉపాధ్యాయుల హాజరును ముఖగుర్తింపు ద్వారా అమలుచేసే విధానంలో ప్రభుత్వం యాప్‌ను రూపొందించింది. దీంతో పాఠశాల పరిధి యొక్క ఆక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా జియోట్యాగ్ చేశారు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాల పరిధిలో ఉండి సంబంధిత యాప్‌లో ముఖగుర్తింపు ద్వారా వారి హాజరును నమోదు చేస్తేనే నమోదవుతుంది. ఇతర ప్రాంతాల్లో ఉండి ముఖ గుర్తింపు ద్వారా హాజరు నమోదు చేసే అవకాశాలు లేవు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు
ముఖగుర్తింపు హాజరు విధానంతో ఉపాధ్యాయుల అనధికార గైర్హాజరు నియంత్రించబడుతుంది. అంతేకాక విద్యార్థుల హాజరు కూడా పక్కాగా తెలిసిపోతుంది. నూతన విధానం అమలుకోసం ఇప్పటికే ఉపాధ్యాయులు వారి ఫోన్లలో సంబంధిత యాప్‌ను రిజిస్ట్రేషన చేసుకుంటున్నారు. ప్రతి ఉపాధ్యాయులు విధిగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ముఖ గుర్తింపు ద్వారానే హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంది.
- అశోక్‌కుమార్, డీఈవో