Nizamabad: తాగుడుకు అడ్డొస్తోందని.. కన్న కూతురిని చంపిన తల్లి
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:07 AM
మద్యానికి బానిసైన ఆ తల్లి తాగుడుకు అడ్డొస్తోందని ఏకంగా తన కన్న కూతురినే హతమార్చింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.

ఐదు నెలల పసికందును గొంతు నులిమి హత్య
నిజామాబాద్ జిల్లాలో దారుణం
భీమ్‌గల్ రూరల్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసైన ఆ తల్లి తాగుడుకు అడ్డొస్తోందని ఏకంగా తన కన్న కూతురినే హతమార్చింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది. భీమ్‌గల్ మండలం గోన్‌గొప్పులకు చెందిన గంగోని మల్లేశ్, రమ్యకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదు నెలల కూతురు శివాని ఉంది. అయితే, ఇటీవల కాలంలో రమ్య కల్లుకు బానిసయింది. భర్త మల్లేశ్.. తీరు మార్చుకోవాలంటూ భార్యకు హితవు పలికాడు. ఆమె మారకపోవడంతో వారం రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇరుకుటుంబాల పెద్దలు సర్దిచెప్పి పంపారు.
అయినా రమ్య మద్యం మత్తులో బిడ్డను నిర్లక్ష్యం చేస్తుండడంతో రెండు రోజుల క్రితం మరోమారు భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. తాగుడు మానుకోవాలని, బిడ్డను పట్టించుకోవాలని భర్త మందలించాడు. దీంతో తన కూతురి వల్లే ఇదంతా జరుగుతోందని భావించిన రమ్య, తన బిడ్డ అడ్డును తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. గత ఆదివారం భర్త మల్లేశ్ బయటకు వెళ్లగా ఇదే అదునుగా భావించి చిన్నారి శివాని గొంతు నులిమి హత్య చేసింది. జరిగిన దారుణం గురించి మల్లేశ్.. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రమ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని భీమ్‌గల్ ఎస్సై తెలిపారు.