ప్రమాదం జరిగిన వెంటనే స్పందించాం
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:49 AM
సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి అన్నారు.

క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రుల్లో చేర్పించాం
సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్
మంత్రులు దామోదర, వివేక్ వెంకటస్వామి
పటాన్‌చెరు, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి అన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు సంగారెడ్డి కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం దామోదర విలేకరులతో మాట్లాడుతూ ప్రమాదం తర్వాత ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించిందన్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు పంపించామన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం వెనకడుగు వేయదన్నారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదన్నారు. బాదిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు.
ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి వివేక్ తెలిపారు. పరిశ్రమ భద్రతపై కార్మిక శాఖ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందన్నారు. పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నామన్నారు. ప్రాథమిక దర్యాప్తులో పరిశ్రమలో రియాక్టర్ పేలలేదని తేలిందని చెప్పారు. కార్మికుల భ్రదత కోసం పరిశ్రమ తీసుకున్న చర్యలను పరిశీలిస్తున్నామన్నారు. కాగా, సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు మరణించడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్ దిగ్ర్భాంతి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.