Share News

Sridhar Babu: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్య: దుద్దిళ్ల

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:30 AM

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Sridhar Babu: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్య: దుద్దిళ్ల

  • యంగ్‌ ఇండియా సమీకృత గురుకులానికి శంకుస్థాపన

పరిగి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మునిసిపాలిటీ పరిధిలోని తుంకులగడ్డలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి గురువారం స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉజ్వల భవితను అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అందుకోసం కోట్లాది రూపాయల ఖర్చుతో సమీకృత పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు.


కులాలకతీతంగా విద్యను అందించాలనే ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సమీకృత పాఠశాలల్లో కార్పొరేట్‌కు మించిన వసతులు ఉంటాయని తెలిపారు. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. పరిగి ప్రాంతానికి సాగునీరు అందించే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని మంత్రి అన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి చర్చిస్తానని తెలిపారు.

Updated Date - Jul 25 , 2025 | 04:30 AM