Seetakka: ప్రజల అభిప్రాయం మేరకే పథకాలు: సీతక్క
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:56 AM
ప్రజల అభిప్రాయం మేరకే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

ఆదివాసీలతో కలిసి సన్నబియ్యంతో భోజనం
ములుగు, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల అభిప్రాయం మేరకే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. తిండి విషయంలో పేద, ధనిక తేడాలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ములుగు జిల్లాలో మంత్రి శనివారం పర్యటించారు. ములుగు మండలంలోని పలు గ్రామాలలో రూ.33కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రెయినేజీ, గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణ పనులను ప్రారంభించారు.
అకాల వర్షాలకు పంటలు, ఇళ్లు దెబ్బతిని నష్టపోయిన గోవిందరావుపేట మండలంలోని రైతులకు నిత్యావసరాలు, కుటుంబానికి రూ.2,500 చొప్పున సాయం అందజేశారు. తాడ్వాయి మండలంలోని మొండెలతోగు గొత్తికోయగూడెంలో ఆదివాసీలు, విద్యార్థులతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేశారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ఆమె తెలిపారు.