Ponguleti Emphasizes Education: విద్య వైద్యానికి పెద్దపీట
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:48 AM
తమ ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు

గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం: మంత్రి పొంగులేటి
ఖమ్మం జిల్లా కూసుమంచిలో జూనియర్ కళాశాల శంకుస్థాపన
కూసుమంచి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి రూ.5.50 కోట్ల ఖర్చుతో నిర్మించ తలపెట్టిన జూనియర్ కళాశాల పనులకు శంకుస్థాపన చేశారు. పొంగులేటి స్వరాజ్యం, రామచంద్రయ్య ట్రస్టు ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యనభ్యసిస్తున్న 80 మంది విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ.. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. పిల్లల్లో నైపుణ్యం పెంపుదలకు స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. విద్యారంగంలో వెనకబడిన పాలేరు నియోజకవర్గాన్ని విద్య పట్ల అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. గత 20 నెలల్లోనే రూ.470 కోట్లు మంజూరు చేశామని, వాటిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా గురుకులం, రూ.208 కోట్లతో జేఎన్‌టీయూ కళాశాల, రూ.5.5 కోట్లతో జూనియర్ కళాశాల, తిరుమలాయపాలెంలో రూ.2.70కోట్లతో హాస్టల్ మంజూరు చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా పేదపిల్లలను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో కంప్యూటర్ ట్రైనింగ్ ట్యూటర్ల నియామకానికి రూ.3లక్షలు మంజూరు చేశారు. విద్యార్థినులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే తమ ట్రస్టు ద్వారా సైకిళ్లు అందజేసి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రతియేటా సైకిళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన పొంగులేటి.. ఒక విద్యార్థిని వెనుక కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కి అందరినీ అలరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News