Heart Surgery: కర్ణాటక బాలికకు ఉచిత గుండె ఆపరేషన్
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:04 AM
చక్కగా ఆడిపాడే ఎనిమిదేళ్ల వయసులో తమ బిడ్డకు ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉందని తేలడంతో ఆ నిరుపేద తల్లిదండ్రుల గుండెల్లో రాయిపడ్డట్లయింది.

చొరవ చూపిన దామోదర.. తల్లిదండ్రుల భావోద్వేగం
ప్రాణాలు కాపాడిన దేవుడంటూ మంత్రికి కృతజ్ఞతలు
హైదరాబాద్, జూలై 10(ఆంధ్రజ్యోతి): చక్కగా ఆడిపాడే ఎనిమిదేళ్ల వయసులో తమ బిడ్డకు ప్రాణాంతకమైన గుండె జబ్బు ఉందని తేలడంతో ఆ నిరుపేద తల్లిదండ్రుల గుండెల్లో రాయిపడ్డట్లయింది. చికిత్సకు రూ.5 లక్షలు అవసరపడుతుండటం..అంత సొమ్ము వెచ్చించే స్థోమత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదరను సాయం కోసం ఆర్థించారు. మంత్రి వెంటనే స్పందించి.. పాపకు నిమ్స్‌లో ఉచితంగా ఆపరేషన్ చేయించడంతో ఆ కన్నవారిలో ఆనందం అర్ణవమైంది. కర్ణాటకకు చెందిన చంద్రకాంత్ దంపతులు హైదరాబాద్ మలక్‌పేట్‌లో ఉంటూ ఓ హోటల్‌లో పని చేసుకుంటున్నారు. బిడ్డ ఐశ్వర్య (8) తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో ఆస్పత్రిలో చూపించారు.
పాప గుండె జబ్బు (ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్)తో బాధపడుతోందని, శస్త్రచికిత్స చేయకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని, ఆపరేషన్‌కు రూ.5లక్షలు ఖర్చవుతుందని అక్కడి డాక్టర్లు చెప్పారు. చంద్రకాంత్ దంపతుల స్వస్థలం కర్ణాటక కావడంతో వారికి ఆరోగ్యశ్రీ కార్డు గానీ, రేషన్ కార్డు గానీ లేవు. బాధిత కుటుంబం మంత్రి దామోదరను కలిసి, పాప పరిస్థితిని వివరించింది. వెంటనే స్పందించిన మంత్రి.. చిన్నారి ఐశ్వర్యను నిమ్స్‌లో చేర్పించారు. ఆమెకు ఆపరేషన్ ఉచితంగా చేయాలని ఆదేశించారు. ఆ మేరకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 4న గోపాల్, ప్రవీణ్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం ఐశ్వర్యకు శస్త్రచికిత్స చేశారు. పాప పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి పంపించారు. చంద్రకాంత్ దంపతులు పాపతో కలిసి గురువారం సచివాలయంలో మంత్రి దామోదరను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News