Metro Expansion: మెట్రో రైలు ‘పార్ట్-బీ’ పరుగులు!
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:00 AM
మెట్రో రైలు రెండో దశలో పార్ట్-బీ కింద ప్రతిపాదించిన నార్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ కారిడార్ల పనులు వేగిరం కానున్నాయి.

మూడు కారిడార్లకు రూ.19,579 కోట్లు
పాలనాపరమైన అనుమతులిచ్చిన సర్కారు
వేగంగా ఫ్యూచర్‌సిటీ, మేడ్చల్, శామీర్‌పేట్ మార్గాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త వెంచర్‌గా ప్రాజెక్టు
పాతబస్తీ మెట్రో పనులకు రూ.125 కోట్లు విడుదల
హైదరాబాద్ సిటీ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): మెట్రో రైలు రెండో దశలో పార్ట్-బీ కింద ప్రతిపాదించిన నార్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ కారిడార్ల పనులు వేగిరం కానున్నాయి. మూడు మార్గాల్లో 86.1 కిలోమీటర్ల పనులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపగా.. ఈ కారిడార్లకు కేటాయించిన రూ.19,579 కోట్లకు ప్రభుత్వం సోమవారం పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవో 113 జారీ చేసింది. దీంతో పనులు మరింత వేగంగా జరగనున్నాయి. హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పార్ట్-ఏ కింద ప్రతిపాదించిన 5 కారిడార్లలోని 76.4 కి.మీ.కు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రూ.24,269 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ (50:50)గా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించాయి. ఇందులో రాష్ట్ర వాటా 30 శాతం, కేంద్ర వాటా 18 శాతం పోగా.. అంతర్జాతీయ బ్యాంకుల నుంచి 48 శాతం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో 4 శాతం నిధులు తీసుకొని పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం డీపీఆర్ కేంద్రం పరిశీలనలో ఉంది.
కిలోమీటరుకు రూ.227.39 కోట్లు!
పార్ట్-ఏ మాదిరిగానే పార్ట్-బీ కింద ప్రతిపాదించిన మూడు కారిడార్లను కూడా జాయింట్ వెంచర్‌గా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తాజాగా కేటాయించిన నిధులే దీనికి నిదర్శనం. కారిడార్-9 కింద శంషాబాద్ ఎయిర్‌పోర్టు- ఫ్యూచర్‌సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ) 39.6 కిలోమీటర్లు చేపడుతున్నారు. కారిడార్-10 కింద జేబీఎ్‌స-మేడ్చల్ (24.5 కి.మీ.), కారిడార్-11 కింద జేబీఎ్‌స-శామీర్‌పేట్ (22 కి.మీ.) నిర్మిస్తున్నారు. మొత్తం 86.1 కి.మీ.కు పాలనా అనుమతులు ఇచ్చారు. ఇందులో ఒక్కో కి.మీ.కు రూ.227.39 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్‌సిటీ మార్గంలో భూసేకరణ సమస్య లేకపోవడంతో ఖర్చు తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. జేబీఎ్‌స-మేడ్చల్, జేబీఎ్‌స-శామీర్‌పేట్‌లో ఖర్చు పెరుగుతోందని అధికారులు తెలిపారు. పాలనా అనుమతులు రావడంతో మెట్రో రెండో దశ పనుల టెండర్ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పారు.
కారిడార్లలో నిర్మాణం జరిగేదిలా..
జేబీఎ్‌స-మేడ్చల్‌లో 24.5 కి.మీ. మార్గం పూర్తి ఎలివేటెడ్ కారిడార్ (ఆకాశమార్గం)లో నిర్మించనున్నారు. జేబీఎ్‌స-శామీర్‌పేట్ కారిడార్‌లో 20.35 కి.మీ. వరకు ఎలివేటెడ్, 1.65 కి.మీ. భూగర్భంలో ఉండనుంది. హకీంపేట విమానాశ్రయం సమీపంలో భూగర్భ మార్గంలో ట్రాక్ ఉంటుందని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు- ఫ్యూచర్ సిటీ 39.6 కి.మీ.లో ఎయిర్‌పోర్టు నుంచి 1.5 కి.మీ. భూగర్భ మార్గంలో, 21 కి.మీ. ఎలివేటెడ్, 17 కి.మీ. భూమిపై ట్రాక్ ఉంటుందని వివరించారు.