BRS: తిరుగు ప్రయాణంలో గంటల కొద్దీ ట్రాఫిక్‌జాం
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:07 AM
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు జనం ప్రవాహంలా తరలొచ్చారు. ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు సైకిళ్లు, ఎడ్లబండ్లు, వాహనాల్లోనే కాకుండా పాదయాత్రగానూ చేరుకున్నారు.

ఎల్కతుర్తి/వరంగల్ క్రైం/ వరంగల్ కార్పొరేషన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు జనం ప్రవాహంలా తరలొచ్చారు. ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు సైకిళ్లు, ఎడ్లబండ్లు, వాహనాల్లోనే కాకుండా పాదయాత్రగానూ చేరుకున్నారు. అయితే సభకు తరలి వచ్చే, తిరుగు ప్రయాణ సమయంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట నుంచి వచ్చే వాహనాలు సభాస్థలికి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయాయి. రాత్రి 8గంటలకే సభ పూర్తయినా.. రాత్రి 11:30గంటలవరకు ఎల్కతుర్తితో పాటు ఆయా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.సభా ప్రాంగణం దాదాపు నిండినా వెనుక భాగంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయు.
దీన్ని ముందే గ్రహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పలుమార్లు వేదికపై నుంచి ఖాళీ కూర్చీలు కనిపించడానికి కారణం ట్రాఫిక్ జామ్ అంటూ పదే పదే చెప్పారు. కేసీఆర్ సభలో పోలీసులు చేతులెత్తేయడంతో ప్రజలను అదుపు చేయడం బీఆర్‌ఎస్ కార్యకర్తల వల్ల కాలేదు. 1100 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నామని కమిషనరేట్ కార్యాలయం నుంచి ప్రకటించినప్పటికీ సభ ప్రాంగణం సమీప ప్రాంతాల్లో 50 నుంచి 100 మంది కూడా కనిపించకపోవడం గమనార్హం. సభ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో పోలీసుల వైఫల్యం కొట్టోచ్చినట్టు కనిపించింది. ఎల్కతుర్తి నుంచి ఎటు వైపుచూసినా సుమారు 10 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది. సభకు వచ్చిన ప్రజలతో పాటు సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.