DK Aruna: ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:23 PM
బీజేపీ కీలక నేత, మహిళా ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి నిన్న అర్థరాత్రి ఓ దుండగుడు ప్రవేశించాడు. దాదాపు గంటన్నర పాటు ఇంట్లో తిరిగాడు. సీసీటీవీ కెమెరాల్లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.

బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని ఓ వ్యక్తి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు, ధరించిన ఆ దుండగుడు అర్థరాత్రి వేళ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్, హాలులోని సీసీటీవీ కెమెరాలను చాకచక్యంగా ఆఫ్ చేశాడు. దాదాపు గంటన్నర పాటు కిచెన్‌లో కలియతిరిగాడు. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో డేకే అరుణ ఇంట్లో లేరు. డీకే అరుణ ఇంటి వాచ్‌మ్యాన్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీల్లో దుండగుడికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి సాయంతో విచారణ వేగవంతం చేశారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి ఆనవాళ్ల కోసం వెతికారు.
దుండుగుడి కోసం అన్ని చోట్లా గాలిస్తున్నారు. అయితే, దుండగుడు గంటన్నర పాటు ఇంట్లో ఉన్నా ఏ వస్తువును దొంగలించలేదు. ఇదే పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ సంఘటనపై అరుణ స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘ నిన్న రాత్రి 3:20 గంటల సమయంలో ఓ వ్యక్తి కిచెన్‌లోని విండో ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు. తర్వాత డోర్ తీసుకుని బయటికి వెళ్ళాడు. ఈ ఉదయం 7:00 గంటలకు నాకు మా పని మనిషి ఫోన్ చేసి చెప్పింది. కిచెన్‌లో.. డైనింగ్ హాల్లో సీసీ కెమెరాలు కట్ చేశాడు. కంప్లీట్ బాడీ ప్యాక్ చేసుకున్నాడు. అన్ని డ్రాలు.. అల్మారాలు తెరిచాడు. అన్ని వస్తువులు బయటికి విసిరాడు. అన్ని రూమ్లు నక్కుకుంటూ వెళ్లాడు. మొత్తం గంటన్నర ఉన్నాడు. సీఎం రేవంత్ ఇంటికి, మా ఇంటికి మధ్య ఓ రోడ్డు మాత్రమే ఉంటుంది. నేను చాలా సార్లు సెక్యూరిటీ కోసం అడిగాను.
నాకు సెక్యూరిటీ అవసరం. వచ్చిన వాడు దొంగతనం కోసం వచ్చి ఉంటే.. ఎదైనా పట్టుకెళ్లాలి. కానీ అది జరగలేదు. సీఎం గారు మా భద్రత గురించి ఆలోచించాలి. మా నాన్నపై దాడి విషయం తెలిసిందే. మా భర్త గురించి కూడా నేను ఆందోళన చెందుతున్నాను. భద్రత కల్పించాలి. ఇంకా పెంచాలి. మా ఇంట్లో మా పిల్లలు పని వాళ్లు అంతా మహిళలే. వాళ్లు చాలా ఆందోళన చెందుతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: కేసీఆర్.. నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో!
Venkaiah Naidu: మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలి