Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమమే..
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:28 AM
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకుంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉద్యమిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

బీజేపీది గల్లీలో ఓ మాట.. ఢిల్లీలో మరో మాట: మహేశ్ గౌడ్
న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకుంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉద్యమిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ యూటర్న్ తీసుకుందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణలో ఓ మాట, ఢిల్లీలో మరో మాట మాట్లాడుతోందన్నారు. అసెంబ్లీలో మద్దతు తెలిపి, కేంద్రంలో తాత్సారం చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తే, బీజేపీ బిల్లుకు ఆమోదం లభించకుండా అడ్డు పడుతోందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వ్యాఖ్యలతోనే బీసీ బిల్లుకు బీజేపీ వ్యతిరేకమని తేలిపోయిందన్నారు. తెలంగాణలో శాస్త్రీయంగా, చట్టబద్ధంగా జరిగిన కులగణన సర్వేపై అధిష్ఠానం.. సీఎం సహా మంత్రివర్గాన్ని, రాష్ట్ర పార్టీని అభినందించిందని చెప్పారు.
బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని, రాష్ట్రం తరఫున కేంద్రంతో పోరాడాలని అధిష్ఠానాన్ని కోరామని వెల్లడించారు. అంతకుముందు భేటీలోనూ ఆయన మాట్లాడారు. న్యాయమైన రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా బీసీలు ఎదురు చూస్తున్నారని, ఆ కల సాకారం కాంగ్రె్‌సతోనే సాధ్యమైందన్నారు. రాహుల్ స్ఫూర్తితోనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనను పూర్తి చేశామని చెప్పారు. దేశానికే తెలంగాణ కులగణన ఆదర్శంగా నిలిచిందని, ఇది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News