Share News

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంతో పోరాడుతాం

ABN , Publish Date - Aug 01 , 2025 | 11:39 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టి బీఆర్‌ఎస్‌ - బీజేపీలను ఓడించామని, ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే రోడ్డెక్కి ప్రజల తరఫున ప్రభుత్వంతో పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే   ప్రభుత్వంతో పోరాడుతాం
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

- రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

కల్వకుర్తి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టి బీఆర్‌ఎస్‌ - బీజేపీలను ఓడించామని, ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే రోడ్డెక్కి ప్రజల తరఫున ప్రభుత్వంతో పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న సీపీఐ ప్రజా ఉద్యమాలే ఊపిరిగా పని చేస్తోందని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా, కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం సీపీఐ జిల్లా మూడవ మహాసభలు ప్రారంభం అయ్యాయి. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి బాలనరసింహ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలోని గచ్చుబావి నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎర్రజెండా పార్టీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేను అయిన తాను రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో గళమెత్తుతున్నానని చెప్పారు. దోపిడీదారులకు ఎర్రజెండా అంటే భయమని, ఎర్రజెండాకు ఎదురులేదని, కార్మికులకు 8 గంటల పని దినాలను సాధించి దోపిడీని అంతం చేయడంలో ఎర్రజెండా ప్రముఖ భూమిక పోషించిందన్నారు. దేశంలోని కమ్యూనిస్టులందరూ ఒక్కటైన రోజు ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌ కాకుండా జన్‌కీ బాత్‌ చేయాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్‌ సంస్థల ఆస్తులు పెరిగాయని పేదలు మరింత పేదలుగా మిగిలారన్నారు. ఈజీఎస్‌ పథకంలో మోదీ ప్రభుత్వం కోతలు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు అందరినీ ఉర్రూతలూగించాయి. బహిరంగ సభకు నాయకులు వెంకటయ్య, ఆనంద్‌, ఫయాజ్‌, కేశవులు, నరసింహ, ఏసయ్య, విజేయుడు, సీహెచ్‌.శ్రీనివాసులు, చంద్రమౌళి, భరత్‌, శ్రీనివాసులు, పి. పరశురాములు, ధారదాసు పాల్గొన్నారు.

గుండెపోటుతో కార్యకర్త మృతి

సీపీఐ జిల్లా మహాసభల ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకున్నది. పెద్దకొత్తపల్లి మండలం దేవునితిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన కే.శ్రీను(45) మహాసభలకు హాజరయ్యారు. ర్యాలీలో పాల్గొన్న అతడు హైదరాబాద్‌కు చౌరస్తాకు చేరుకోగానే ఛాతీలో నొప్పి వస్తుందని తోటి వారికి చెప్పారు. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. అతడికి భార్య ఆలివేల, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Updated Date - Aug 01 , 2025 | 11:39 PM