Share News

బీసీలకు ఇచ్చిన హామీ అమలు చేయాలి

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:40 PM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బీసీలకు ఇచ్చిన హామీ అమలు చేయాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ

- సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ

అచ్చంపేట టౌన్‌, జూలై 31 (ఆంధజ్యోతి) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా, అచ్చంపేట ప ట్టణంలోని టీఎన్‌జీవో భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి, ప్రత్యేకంగా అమలు చేసుకొనే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరు తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీ జేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, గుజరాత్‌లలో రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడాన్ని పార్టీ స్వాగతిస్తోందన్నారు. పాకిస్థాన్‌, ఇండియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో సమాధానం చెప్పాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దేశ్యా నాయక్‌, నాయకులు వెంకట్రాములు, ధర్మానాయక్‌, శంకర్‌ నాయక్‌, నాగరాజు, సైదులు, సయ్యద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 11:40 PM