పొంచి ఉన్న ప్రమాదం
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:10 PM
మండల కేంద్రం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారిపై పలు చోట్ల మలుపులతో పాటు సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.

-మలుపుల వద్ద సూచికల బోర్డులు కరువు
- పట్టించుకోని ఆర్‌ఆండ్‌బీ అధికారులు
నవాబ్‌పేట, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారిపై పలు చోట్ల మలుపులతో పాటు సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు ధ్వంసం కావడంతో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నారు. అయితే మార్గమధ్యలో పర్వతాపూర్ మైసమ్మ ఆలయం ఉండటంతో ప్రతీ ఆది, మంగళవారాల్లో ఉమ్మడి జిల్లాలోని భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ రహదారిపై నిత్యం పరిగి, షాద్‌నగర్, కొందుర్గుతో పాటు వివిధ ప్రాంతాలకు వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తుండగా, ఆదివారం నవాబ్‌పేట సంతకు వేల సంఖ్యలో ప్రయాణికలు, వినియోగదారులు రాకపోకలు సాగిస్తారు. ఈ క్రమంలో ప్రధానంగా చిక్కుడు వాగు, పర్వతాపూర్ మైసమ్మ, తీగలపల్లి గేట్, కాకర్లపాడ్, రుద్రారం, గద్దగుండు, యన్మనగండ్ల గేట్ తదితర ప్రాంతాల్లో సూచిక బోర్డులు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు సూచిక బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.