పరిశ్రమల కాలుష్యంపై పరిశీలన
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:16 PM
ఫార్మ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన అధికారుల బృందం జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్‌లోని పరిశ్రమలను, వ్యవసాయ పొలాలను మంగళవారం పరిశీలించారు.

పూర్తి నివేదికను అధికారులకు ఇస్తామన్న బృందం
జడ్చర్ల, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఫార్మ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన అధికారుల బృందం జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్‌లోని పరిశ్రమలను, వ్యవసాయ పొలాలను మంగళవారం పరిశీలించారు. జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ ప్రతా్‌పరెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి వెంకటేశ్, కాలుష్య నియంత్రణ బోర్డు ఏఈ విద్యుల్లత, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ సురేశ్, జడ్చర్ల తహసీల్దార్ నర్సింగ్‌రావు బృందంలో ఉన్నారు. సెజ్‌లోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య నీటితో వ్యవసాయ పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పంటలు పండే పరిస్థితి లేదని కలెక్టర్ విజయేందిర బోయికి ఫిర్యాదు చేశారు. దాంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారుల బృందం మొదటగా పోలేపల్లి సెజ్ సమీపంలోని వ్యవసాయ పొలాలను పరిశీలించింది. పొలాల్లోకి ఫార్మ పరిశ్రమల నుంచి కాలుష్య నీరు వదిలితే ఎక్కడి నుంచి వస్తాయనే విషయాన్ని బాధిత రైతులు రఘునందన్‌చారి, వెంకటయ్య, గణేష్ వివరించారు. పొలాల్లోని బోర్ల నీరు, పంట పొలాల మట్టి నమూనాలను సేకరించారు. అనంతరం పోలేపల్లి సెజ్‌లోని ఫార్మ పరిశ్రమలను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న ఓ ఫార్మ పరిశ్రమలో అనుమతులు లేకుండా పెద్ద ఇంకుడుగుంతను నిర్మించిన తీరును అధికారులు ఆక్షేపించారు. అనంతరం ఆమ్నీల్, శిల్ప, మైలాన్ పరిశ్రమలను పరిశీలించారు. శిల్ప ఫార్మ పరిశ్రమ నుంచి సెజ్ సమీపంలోని గుండ్లగడ్డ తండాలో ఉన్న నీళ్ల కుంటలోకి కాలుష్య నీటిని వదులుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.
అధికారులకు చేదు అనుభవం
సెజ్‌లోని అరబిందో, హెటిరో ఫార్మ పరిశ్రమల క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారుల బృందంలోని ఇద్దరిని మాత్రమే పరిశ్రమలోకి అనుమతి ఇచ్చారు. విషయం పరిశ్రమల యాజమాన్యానికి తెలియడంతో కొందరు ప్ర తినిధులు వచ్చి, లోపలికి రావాలని బయట ఉన్న అధికారులకు విజ్ఞప్తి చేశారు. అవమానంగా భావించిన వారు లోపలికి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు చెప్పారు.