Share News

మేడే పోస్టర్‌ విడుదల

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:05 PM

కార్మికుల శ్రమను దోచుకునేందుకు తెరపైకి 12 గంటల పని విధానాన్ని తీసుకువస్తున్నారని టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మేడే పోస్టర్‌ విడుదల
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్‌

పాలమూరు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : కార్మికుల శ్రమను దోచుకునేందుకు తెరపైకి 12 గంటల పని విధానాన్ని తీసుకువస్తున్నారని టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మే డే పోస్టర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. నేటి సమాజంలో శ్రామికులు 8 గంటల పనిని కేవలం నాలుగు గంటలు మాత్రమే చేస్తే సరిపోతుందన్నారు. అయినప్పటికీ పెట్టుబడిదారులు ఏ విధానంలో కార్మికుల శ్రమను దోచుకుంటే బాగుంటుందో ఆలోచన చేసి ప్రణాళిక రూపొందించారన్నారు. ఇన్పోసిస్‌ అధినేత నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పని చేయాలని, ఆదివారం పని చేయాలని, ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ సుబ్రమణ్యం వారానికి 90 గంటలు పనిచేసి ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని చిలుక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. దానికి అనుగుణంగానే కేంద్రం నాలుగు లేబర్‌కోడ్‌లు, 12గంటల పనివిధానాన్ని ప్రతిపాదించారని తెలిపారు. రాజ్యాంగం, కోర్టుల గురించి గొప్పలు చెప్పుకునే పాలకులారా సమానపనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీం కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయటంలేదని ప్రశ్నించారు. రైస్‌మిల్‌ సంఘం అధ్యక్షుడు దాసు, కార్యదర్శి శేఖర్‌, కృష్ణ, ఆంజనేయులు, నారాయణ, శ్రీను, చెన్నయ్య, వెంకటేష్‌ పాల్గొన్నారు.

మేడే ను జయప్రదం చేద్దాం

జడ్చర్ల : మే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడేను ఘనంగా జరుపుకుందామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు రాములు పిలుపునిచ్చారు. జడ్చర్లలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మే 1న జిల్లాలోని కార్మికవర్గం అంతా ఐక్యంగా కదలి మేడే దీక్షా దినంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. కార్మికుల అడ్డాల వద్ద జెండాలు ఎగురవేసి ర్యాలీలు నిర్వహించి, సభలలో పాల్గొనాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దీప్లానాయక్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్‌, సీఐటీయూ జిల్లా సహయకార్యదర్శి తెలుగు సత్తయ్య, మునిసిప్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నర్సిములు, రైతు సంఘం నాయకులు మధు, సాయిలు, యాదయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:05 PM