Share News

యూనివర్సిటీల్లో వినుత్నమైన కోర్సులు

ABN , Publish Date - Jun 11 , 2025 | 11:27 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వినూత్నమైన కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి అన్నారు.

యూనివర్సిటీల్లో వినుత్నమైన కోర్సులు
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ బాలకిష్టారెడి ్డని గజమాలతో సన్మనిస్తున్న పీయూ వీసీ జీఎన్‌ శ్రీనివాస్‌,అదికారులు

- ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి

- పీయూలో ప్రారంభమైన టీజీ పీఈసెట్‌ ఎంపికలు

- తొలి రోజు 368 మంది విద్యార్థులు హాజరు

పాలమూరు యూనివర్సిటీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వినూత్నమైన కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న టీజీ పీఈసెట్‌ను బుధవారం వైస్‌ చాన్సలర్‌, ఫ్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌, పూర్వ వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, రిజిస్ట్రార్‌ రమేశ్‌బాబు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యా విధానంలో నూతన మార్పులు తీసుకొస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, అవగాహనతో కూడిన నైపుణ్యం, ఉపాధి అవకాశాలు లభించే మరిన్ని కోర్సులను ప్రవేశపెట్టన్నుట్లు తెలిపారు. పాలమూరు యూనివర్సిటీలో, పచ్చని ప్రకృతి నడుమ తెలంగాణ రాష్ట్ర ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీజీ పీఈసెట్‌) నిర్వహించడం శుభపరిణామం అన్నారు. అనంతరం ఆయనను పీయూ వైస్‌ చాన్సలర్‌, ఫ్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌, పూర్వ వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, రిజిస్ట్రార్‌ రమేశ్‌ బాబు తదితరులు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత పీఈసెట్‌లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులను పరిచయం పరిచేసుకొని, జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

- బీపీఎడ్‌ కోర్సులో 515 మంది విద్యార్థులకు గాను 368 మంది విద్యార్థులు హాజరయ్యారని, 147 మంది గైర్హాజరయ్యారని టీజీ పీఈసెట్‌ కన్వీనర్‌ ఫ్రొఫెసర్‌ దిలీప్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీపీఎడ్‌ కోర్సులో 217 మంది విద్యార్థులకు గాను 149 మంది హజరయ్యారు. 68 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

కాలానుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఫ్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి అన్నారు. పాలమూరు యూనివర్సిటీలోని ఫార్మసీ ఆడిటోరియంలో కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన రెండు రోజుల వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్‌ తరాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యావిధానంలో మార్పులు దేవాలన్నారు. ప్రతీ ఒక్కరు జాతీయ విద్యావిధానం ప్రకారం బహుళ సబ్జెక్టులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వీసీ ప్రొఫెసర్‌ జీఎన్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సిలబస్‌ కరికులంలో ఉన్నత విద్యామండలి సూచన మేరకు సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ పూస రమేశ్‌బాబు, అకాడమిక్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చంద్రకిరణ్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కరుణాకర్‌ రెడ్డి, డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి, డాక్టర్‌ రవికాంత్‌, విభాగాధిపతి విభాగధిపతి డాక్టర్‌ ఆంజనేయులు, అధ్యపకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 11:27 PM