Share News

ఆదమరిస్తే.. అంతే

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:08 PM

బీటీ రోడ్డుకు చివర ఇరువైపులా సుమారు రెండు ఫీట్ల మేర రోడ్డుకు సమాంతరంగా మట్టిని నింపుతారు.

ఆదమరిస్తే.. అంతే
దేవునిగుట్ట తండాకు వెళ్లే రోడ్డు పక్కన ఏర్పడిన గుంతలు

- ఆ రోడ్డుపై ప్రయాణం ప్రాణాలతో చెలగాటం

- మరమ్మతు చేపట్టాలని కోరుతున్న తండావాసులు

జడ్చర్ల, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : బీటీ రోడ్డుకు చివర ఇరువైపులా సుమారు రెండు ఫీట్ల మేర రోడ్డుకు సమాంతరంగా మట్టిని నింపుతారు. జడ్చర్ల మండలంలోని దేవునిగుట్టతండాకు వెళ్లే దారి అందుకు భిన్నంగా, ప్రాణాలను బలిగొనే విధంగా ఉంది. సుమారు ఒక కిలో మీటరు మేర ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆ ప్రాంత వాసులు ప్రయాణం సాగిస్తున్నారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం దారి నుంచి కేజీబీవీ మీదుగా దేవునిగుట్టతండాకు వెళ్లే దారిలో ఈ పరిస్థితి నెలకొంది. కేజీబీవీ నుంచి దేవునిగుట్టతండాకు వెళ్లే దారిలో సుమారు ఒక కిలో మీటరు మేర రోడ్డుకు ఎడమవైపు రెండు ఫీట్ల మేర లోతుగా గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు చివర ఉన్న పరిస్థితిని తెలిపే విధంగా ఎలాంటి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదు. ఆదమరిస్తే... ఆ రోడ్డుకు బలికావాల్సిందే అన్న చందంగా ఉంది. దేవునిగుట్ట సమీపంలోనే ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు గ్రామాలైన వల్లూరు, ఉదండాపూర్‌ గ్రామాలతో ఐదు తండాలకు చెందిన ముంపువాసులకు పునరావాసం కల్పిస్తున్నారు. అందుకు సంబంధించిన పనులు చేపడుతున్నారు. పనుల్లో భాగంగా టిప్పర్లు ప్రతీ రోజు ఆ రోడ్డుగుండానే రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ దారిగుండానే ఇరిగేషన్‌శాఖ అధికారులతో పాటు దేవునిగుట్టతండాకు వెళ్లే వారంతా రాకపోకలు సాగిస్తున్నారు. ఒకే సమయంలో ఆ దారిలో ఎదురెదురుగా వాహనాలు వచ్చిన సందర్భంలో ప్రమాదం జరిగే విధంగా ఉన్న ఆ రోడ్డుకు మరమ్మతు చేయించి, ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని తండావాసులు కోరుతున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:08 PM