పైసలు పడ్తలేవు
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:35 PM
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు విక్రయించిన ధాన్యం డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నది.

- 15 రోజుల కింద ధాన్యం విక్రయించిన రైతులు
- ఇంత వరకు రైతుల ఖాతాలో జమ కాని డబ్బులు
- డబ్బుల కోసం అన్నదాతల ఎదురుచూపులు
- ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం 32వేల మెట్రిక్ టన్నులు
- రూ.75 కోట్లకు గాను చెల్లించింది రూ.8 కోట్లు... రూ.64 కోట్లు పెండింగ్
వనపర్తి, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు విక్రయించిన ధాన్యం డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. 15 రోజుల కిందట విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు డబ్బులు ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు డబ్బులు అడగడానికి వెళ్తే సంబంధిత అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారని మండిపడుతున్నారు. అసలే ఆరుగాలం కష్టపడి కష్టనష్టాలకు ఓర్చి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిసినా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ధాన్యం విక్రయించి 15 రోజులు అవుతున్నా కూడా నయా పైసా కూడా రైతుల ఖాతాలో జమ కాకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అసలే పంటకు నీళ్లు లేక అప్పులు తెచ్చి బోర్లు వేసి పంట పండిస్తే విక్రయించిన ధాన్యాన్ని కూడా సకాలంలో డబ్బులు రాకపోవడంతో రైతాంగం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
15 రోజులు దాటినా అందని డబ్బులు
ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 481 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి వరకు 369 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాల వద్ద ఈ సీజన్‌కు సంబంధించి 3 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4400 మంది రైతుల నుంచి 32వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందుకు గాను వారికి రూ.75 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయాలి. కానీ ఇప్పటి వరకు 639 మంది రైతులకు రూ. 8 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 3761 మంది రైతులకు గాను రూ.67 కోట్లు చెల్లించాలి. సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో పలువురు రైతులు సంబంధిత అధికారులను అడిగితే రకరకాల కారణాలు చెబుతున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయంపై పౌర సరఫరాల శాఖ అధికారులను వివరణ కోరగా ట్యాబ్ ఎంట్రీ సకాలంలో జరగకపోవడంతోనే డబ్బుల విషయంలో ఆలస్యం జరుగుతున్నదని, రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డబ్బులు జమ కాని రైతులకు నాలుగైదు రోజుల్లో వారి ఖాతాలో జమ చేస్తామని చెబుతున్నారు.
పక్షం రోజులు గడిచిన ధాన్యం డబ్బులు రాలే
- సహదేవుడు, ఆత్మకూరు మండలం, మూలమల్ల గ్రామం
గత 15 రోజులు గడుస్తున్నా ధాన్యం డబ్బులు ఇంకా పడలేదు. గిట్టుబాటు ధరతో పాటు సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 వస్తాయని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించినా నాకు ఉన్న మూడు ఎకరాల్లో 65 క్వింటాళ్ల ధాన్యాన్ని మూలమల్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నాను. అమ్ముకుని 15 రోజులు గడుస్తున్నది. ఇప్పటి వరకు ధాన్యం డబ్బులు, బోనస్ డబ్బులు రాలేదు. పురుగుల మందులు, విత్తనాల ఖర్చు, వరి కోత యంత్రం వంటి వారికి చెల్లించాల్సి ఉంటుంది. కావునా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధాన్యం, బోనస్ డబ్బులు తక్షణమే ఖాతాలో జమ చేయాలని అధికారులను కోరుతున్నాను.