Share News

సంక్షేమం కోసం.. రూ.లక్ష కోట్లు ఖర్చు

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:50 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

సంక్షేమం కోసం.. రూ.లక్ష కోట్లు ఖర్చు

- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

- కొల్లాపూర్‌లోనే రాజకీయ ఓనమాలు దిద్దుకున్నా

- ఈ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉంది

- ప్రపంచాన్ని ఆకర్షించేలా తెలంగాణ టూరిజం అభివృద్ధికి కృషి

- రూ. 65.67 కోట్ల అంచనా వ్యయంతో 7 విద్యుత్‌ ఉప కేంద్రాలకు శంకుస్థాపన

- లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల హక్కు పత్రాలు పంపిణీ

కొల్లాపూర్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ కొల్లాపూర్‌ పట్టణంలో సురభి కోట ముందు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 33/11 కేవీ విద్యుత్‌ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. రైతులకు విద్యుత్‌ ట్రాన్‌ ్సఫార్మర్లు పంపిణీ, అర్హులైన 4వేల మంది లబ్ధిదారులకు నూతన రేషర్‌ కార్డుల అందజేత, 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్ల హక్కు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌అలీ ఫరూఖీ, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేష్‌ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ, మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.65.67 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న 7 విద్యుత్‌ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బంగ్లా ముందు ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలు వారి సమస్యలను నాయకులకు స్వేచ్ఛగా చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆలోచనలే మా పార్టీ ఎజెండాగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పై ప్రాంతంలో తెలంగాణ భూ భాగంలో ఒక డ్యామ్‌ కడితే పెద్ద ఎత్తున కృష్ణానీటిని తీసుకునే అవకాశం ఉన్నా నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయలేదని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేశామని తెలిపారు. పర్యాటక రంగంలో తెలంగాణ ప్రపంచాన్ని ఆకర్షించేలా మంత్రి జూపల్లి కృష్ణారావు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. ఇప్పటి వరకు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన ఖర్చు రూ.6,680 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మొదటి దశలో నిర్మించేందుకు రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

కొల్లాపూర్‌తో ప్రత్యేక అనుబంధం

తమ సోదరుడు స్వర్గీయ మల్లు అనంత రాములు 1980లో నాగర్‌కర్నూల్‌ ఎంపీగా పోటీ చేసిన సమయంలో తాను విద్యార్థిగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో తనను కొల్లాపూర్‌ ఇన్‌చార్జిగా నియమించారని, ఆనాడే తాను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న 98 జీవో బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపాదించిన గ్రామాలలో ఎస్‌బీఐ బ్యాంకుల పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. పాలమూరు ముద్దు బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కొల్లాపూర్‌ రాజకీయ జీవితం ప్రారంభించిన తాను డిప్యూటీ సీఎంగా ఉన్నానని తెలిపారు. కోన్‌ పూచ్‌తే.. కొల్లాపూర్‌ నుంచి సబ్‌పూచ్‌తే కొల్లాపూర్‌ స్థాయికి ఎదిగిందన్నారు. నిత్యం ప్రజల కోసమే ఆలోచన చేస్తున్న వ్యక్తి జూపల్లి కృష్ణారావు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారని పిలిస్తే పలికే వ్యక్తిగా ఎంపీగా మల్లురవిని ఈ ప్రాంత ప్రజలు గెలిపించి చట్టసభలకు పంపించారని గుర్తు చేశారు. కొల్లాపూర్‌ నియోజకవర్గ కేంద్రంలో అడ్వాన్స్‌డ్‌ ఐటీఐ కళాశాల ప్రారంభించేందుకు తగు నిర్ణయం తీసుకునేలా ప్రయత్నం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

వెల్టూరు, చిన్నమారూర్‌ మధ్య కృష్ణానదిపై డ్యాం నిర్మించాలి

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా కృష్ణా జలాలను ఇప్పటికే భారీగా తరలించుకుపోతున్నదని అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణతో మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరగనుందని, శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీళ్లు , రెండు మూడు నెలల్లోనే ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత నీటి సమస్య తీరాలంటే వెల్టూరు, చిన్నమారూర్‌ మధ్య కృష్ణానదిపై ఒక డ్యాం నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒక ఎకరం కూడా

ముంపు ముప్పు లేకుండా సుమారు 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని, మీ సహకారం కూడా కావాలని ఉప ముఖ్యమంత్రి ని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు 98 జీవో ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలల్సి ఉండే కానీ అది నెరవేరలేదని, వారికి కనీసం పంచాయతీ సెక్రటరీ లేదా లష్కర్‌ ఉద్యోగాలు ఇవ్వాలని, లేకపోతే ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో లైబ్రరీల అభివృద్ధికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించిన ఎంపీ మల్లు రవికి ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణ ఏర్పడకముందు రూ.75వేల కోట్ల అప్పు ఉంటే పదేండ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పు అయిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, వాటన్నింటిని అమలు చేసి తీరుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆ తరువాత రైతులకు రూ.10 కోట్ల విలువైన విద్యుత్‌ సామాగ్రి , నియంత్రికలను పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, రేషన్‌ కార్డులను అందజేశారు.

అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి రూ.6,680 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని తద్వారా ప్రజలకు ఆర్టీసీతో పాటు ప్రభుత్వానికి లాభం చేకూరిందని తెలిపారు. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దయ్యాలకు ,భూతాలకు అవకాశం ఇవ్వొద్దని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవ సహాయం గద్వాల మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సరిత తిరుపతయ్య, పిసిసి ఉపాధ్యక్షులు చింతలపల్లి జగదీశ్వర్‌రావు, వివిధ మండలాల మాజీ ప్రజాప్రతినిధులు అల్లాపూర్‌ మునిసిపల్‌ మాజీ కౌన్సిలర్లు సంబంధిత శాఖల అధికారులు, కొల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజలు , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలి

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం సోమశిల తెలంగాణ టూరిజం గెస్ట్‌ హౌస్‌ వద్ద జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పొరపాట్లకు తావు లేకుండా నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రాత్రి సోమశిల గ్రామంలో మృగవాని కాటేజీలలో ఉప ముఖ్య మత్రిర బస చేసి ఆదివారం ఉదయం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌ కు తిరుగు ప్రయాణం కానున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 11:50 PM