Share News

బాల్యానికి ‘బంధం’ వద్దు

ABN , Publish Date - Aug 01 , 2025 | 11:36 PM

బాల్యానికి మూడు ముళ్ల బంధం వద్దని, బాల్య వివాహం చేసి వారి భవిష్యత్తును నాశనం చేయొద్దని అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

బాల్యానికి ‘బంధం’ వద్దు
బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ( ఫైల్‌ )

- బాల్య వివాహాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

- ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు

వనపర్తి రూరల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : బాల్యానికి మూడు ముళ్ల బంధం వద్దని, బాల్య వివాహం చేసి వారి భవిష్యత్తును నాశనం చేయొద్దని అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా వనపర్తి జిల్లాలో అక్కడకక్కడ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితం ఉండటం లేదు. నిరక్షరాస్యత, ఆర్థిక వెనుకబాటు, ఆడపిల్లలపై అభద్రతా భావం, పేదరికం, సామాజిక పరిస్థితులు అందుకు కారణం అవుతున్నాయి.

4 ఏళ్లలో 165 వివాహల అడ్డగింత

బాల్య వివాహాల నియంత్రణకు మహిళా శిశు సంక్షేమ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పురుషుడి వివాహం వయస్సు 21, స్ర్తీల వివాహ వయస్సు 18 ఏళ్లు తప్పనిసరిగా నిర్ణయించింది. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందగానే జిల్లా బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో అధికారులు అక్కడికి చేరుకొని అడ్డుకుంటున్నారు. వివాహాన్ని నిలిపివేసి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. బాల్య వివాహం చేసినా, అందుకు ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమని చెప్తున్నారు. ఇలా గత 4 ఏళ్లలో వనపర్తి జిల్లా వ్యాప్తంగా 165 వివాహాలను అడ్డుకున్నారు. 2022లో 43, 2023లో 37, 2024లో 55, 2025లో 30 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. బాధ్యులపై 50 కేసులు నమోదు చేశారు.

అవగాహన కార్యక్రమాలు

వనపర్తి జిల్లాల్లో 15 మండలాల పరిధిలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్న కొన్ని గ్రామాలను అధికారులు గుర్తించారు. వాటిని ప్రత్యేక హబ్‌లుగా గుర్తించి బాల్య వివాహాలు, వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో బాల్యవివాహ రహిత గ్రామాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రతీ నెల పాఠశాలల్లో పరిశీలించి, సుదీర్ఘకాలంగా హాజరు కాని బాలికలను గుర్తించి, జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాను అంగన్‌వాడీ టీచర్‌ జిల్లా బాలల సంరక్షణ యూనిట్‌కు పంపిస్తున్నారు. వారు ఆ బాలికల ఇళ్లకు వెళ్లి విచారణ నిర్వహిస్తున్నారు. బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే అనర్థాలు, చదువు ప్రాధాన్యంపై వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. బాలికలను పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. జిల్లాలోని పాన్‌గాల్‌, వనపర్తి, ఘనపూర్‌, కొత్తకోట మండలాల్లో బాల్య వివాహాలను అడ్డుకొని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రతీ మంగళ, బుధ వారాల్లో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబు తెలిపారు.

ప్రత్యేక నిఘా ఉంచాం

బాల్య వివాహలపై ప్రత్యేక నిఘా ఉంచి, వాటి నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో పోలిస్తే బాల్య వివాహాల సంఖ్య తగ్గింది. బాల్య వివాహాల నియంత్రణకు గ్రామం, మండల స్థాయి కమిటీలు వేసి పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అక్కడికి వెళ్తున్నాం. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వివాహాలు నిలిపి వేయిస్తున్నాం.

- సుధారాణి, జిల్లా సంక్షేమ అధికారి

Updated Date - Aug 01 , 2025 | 11:36 PM