Share News

చట్టాలపై అవగాహన బాధ్యత

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:13 PM

మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని షీటీం నారాయణపేట జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఐ సునీత అన్నారు. మహిళా చట్టాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నారాయణపేట శ్రీసాయి జూనియర్‌ కళాశాలలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

చట్టాలపై అవగాహన బాధ్యత
సదస్సులో మాట్లాడుతున్న షీటీమ్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఐ సునీత

నారాయణపేట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని షీటీం నారాయణపేట జిల్లా ఇన్‌చార్జి ఎస్‌ఐ సునీత అన్నారు. మహిళా చట్టాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో నారాయణపేట శ్రీసాయి జూనియర్‌ కళాశాలలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ప్రిన్సిపాల్‌ రామకృష్ణ అధ్యక్షత వహించారు. సునీత, టౌన్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, మహిళా ఎస్‌ఐ గాయత్రి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎస్పీ యోగేష్‌ నేతృత్వంలో షీ టీమ్‌ పోలీస్‌ విభాగం మహిళల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ వంటి ఘటనలకు అడ్డుకట్ట వేసే శక్తిగా షీటీం నిలుస్తోందన్నారు. అమ్మాయిలకు ఏ సమస్య ఎదురైనా లేదంటే అసౌకర్యానికి గురైనా భయపడకుండా షీ టీమ్‌ను సంప్రదించాలన్నారు. 21వ శతాబ్దంలో ఉన్నా, మహిళలు ఇంకా భయంతో బతకాల్సి వస్తోందన్నారు. వీధుల్లో, బస్సుల్లో, కాలేజీల్లో, పనిచేసే చోట వారిపై వేధింపులు జరగడం బాధాకరమన్నారు. భారత రాజ్యాంగం, చట్టాలు మహిళల రక్షణ కోసం ప్రత్యేక శక్తిని అందిస్తున్నాయన్నారు. వేధింపులు ఎదురైతే వెంటనే డయల్‌ 100 లేక షీ టీమ్‌ నంబర్‌ 8712670398కు కాల్‌ చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. జీపీఎస్‌ ట్రాకింగ్‌ యాప్‌లు ఉపయోగించుకుంటే మీ లోకేషన్‌ మీ కుటుంబ సభ్యులకు తెలుస్తుందన్నారు. మహిళల భద్రత అందరిదని, చట్టాలపై పరిజ్ఞానం, నైతిక ధైర్యం, సామాజిక స్ఫూర్తి ఉంటేనే మన సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. భద్రత మన హక్కు అని, న్యాయం కోసం నడవాలని చెప్పారు. విద్యార్థులకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో షీ టీమ్‌ అధికారుల బృందం బాల్‌రాజు, చెన్నప్ప, జ్యోతి, కవిత, ఎస్పీ పీఆర్‌వో వెంకట్రామలు, ఆంధ్రజ్యోతి విలేకరుల బృందం శ్రీధర్‌రావు, నారాయణరెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌, కే.శ్రీనివాస్‌, ఫొటోగ్రాఫర్‌ గడ్డం రవికుమార్‌, ఎబీఎన్‌ విలేకరి నక్క శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:13 PM