Komatireddy: లక్షల కోట్లతో కూలిపోయే కాళేశ్వరం కట్టారు
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:31 AM
కేసీఆర్ హయాంలో రూ.లక్షల కోట్ల అప్పులు చేసి.. కూలిపోయే కాళేశ్వరం కట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు కుంగిపోయి కూలిపోతున్నా..

మరమ్మతుల పేరిటా రూ.కోట్ల దోపిడీ
బీఆర్‌ఎస్ పాలనలో పల్లెలకు రోడ్లు వేయలేదు
ఫాంహౌస్ చుట్టూ రూ.750కోట్లతో రోడ్లు
పదేళ్లు దోచుకున్నారు: మంత్రి కోమటిరెడ్డి
బిచ్కుంద, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : కేసీఆర్ హయాంలో రూ.లక్షల కోట్ల అప్పులు చేసి.. కూలిపోయే కాళేశ్వరం కట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు కుంగిపోయి కూలిపోతున్నా.. మరమ్మతుల పేరిట రూ.కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కోమటిరెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం బిచ్కుందలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడుతుంటే.. బీఆర్‌ఎస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పదేళ్లుగా కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల పాలు చేసిందన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ నెలకు రూ.6వేల కోట్ల వడ్డీ చెల్లిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో పల్లెలకు రోడ్లు వేయలేదు కానీ.. కేసీఆర్ తన ఫాంహౌస్ చుట్టూ రూ.750 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.
పదేళ్లలో యువతకు ఉద్యోగాల గురించి పట్టించుకోలేదు కానీ.. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు దక్కాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబానికి తప్ప... ఏ పేద కుటుంబానికీ మేలు జరగలేదని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ నేతలు చెప్పే అబద్ధాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఏడాదిన్నరలోనే పేదలకు 5లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మిస్తున్నామని, ఏడాదిన్నరలోనే 60వేల ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. బిచ్కుంద నుంచి శాంతాపూర్ జాతీయ రహదారి వరకు రెండు లేన్ల ప్రధాన రహదారికి రూ.20కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. మంత్రి ఉత్తమ్‌తో మాట్లాడి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న లెండి, నాగమడుగు ప్రాజెక్టులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.