Kishan Reddy: రాహుల్‌ది ఏ కులమో చెప్పు
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:40 AM
ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మొదట వారి నాయకుడు (రాహుల్ గాంధీ) ఏ సామాజికవర్గమో, ఏ కులమో చెప్పాలని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

మోదీని కన్వర్టెడ్ బీసీ అంటావా?.. సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
న్యూఢిల్లీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మొదట వారి నాయకుడు (రాహుల్ గాంధీ) ఏ సామాజికవర్గమో, ఏ కులమో చెప్పాలని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ప్రజెంటేషన్‌లో ప్రధాని మోదీని కన్వర్టెడ్ బీసీ అన్నారని.. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మిడిమిడి జ్ఞానంతో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘1994లో గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదిక ప్రకారం.. మోదీ కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది. అప్పుడు మోదీ ఎమ్మెల్యేగా కూడా లేరు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కులాన్ని జాతీయ స్థాయిలో ఓబీసీ జాబితాలో చేర్చింది. అదే సమయంలో విశ్వబ్రాహ్మణులతో పాటు మరికొన్ని కులాలను కూడా బీసీల్లో చేర్చారు. ఆ తర్వాత కూడా చాలా కులాలను ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చారు. మరి వారందరినీ కూడా కన్వర్టెడ్ కులాలకు చెందిన వారని చెబుతారా?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. పెంచిన బీసీ రిజర్వేషన్లతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని బీజేపీ కోరుకుంటోందని.. అయితే ఆ 42శాతం రిజర్వేషన్లు అక్బరుద్దీన్, అసదుద్దీన్, అజారుద్దీన్, షబ్బీర్ అలీ వంటి ముస్లిం వర్గానికి కాకుండా పూర్తిగా బీసీలకే అందేలా ఉండాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనలో 56 శాతం బీసీలు ఉన్నట్టు తేలిందంటూ.. అందులోనే 10 శాతం ముస్లింలను చూపించిందన్నారు. 10శాతం ఈబీసీ రిజర్వేషన్లలో ముస్లింలు లబ్ధి పొందే అవకాశం ఉందని, మళ్లీ బీసీల కింద చూపి మరో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి, రాహుల్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇలా తెచ్చే బీసీ రిజర్వేషన్లతో అసదుద్దీన్ పార్టీ, షబ్బీర్ ఆలీ, అజారుద్దీన్ వంటి కాంగ్రెస్ నేతలకు లబ్ధి చేకూర్చడమే తప్ప.. బీసీలకు ఒనగూరే ప్రయోజనమేమీ లేదన్నారు. తాము కాంగ్రె్‌సలా తూతూమంత్రపు సర్వేలు చేయబోమని... రాజ్యంగ బద్ధంగా కులగణన చేసి, బీసీలకు న్యాయం చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.
పార్టీ నిర్ణయిస్తే సమర్థిస్తాం..
బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘వేరే వారికి నీతులు చెప్పే ముందు రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి, బీసీని ముఖ్యమంత్రిని చేయాలి. దత్తాత్రేయ ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై మా పార్టీ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా సమర్థిస్తాం’’ అని చెప్పారు. తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్‌పై ఇప్పటివరకూ చర్యలేమీ లేవని, కాంగ్రెస్ అధిష్ఠానానికి, బీఆర్‌ఎ్‌సకు మధ్య అవగాహన కుదిరిందని ఆరోపించారు.
బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు: పాయల్ శంకర్
కులగణన ద్వారా బీసీల జనాభా లెక్క తేలినప్పుడు ఆ ప్రాతిపాదికన రాష్ట్ర మంత్రివర్గంలో ఎందుకు మంత్రి పదవులు ఇవ్వట్లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాటలకు, చేతలకు పొంతన లేదని.. కేవలం బీజేపీని బద్నాం చేసి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
ఈ వీడియోలను వీక్షించండి..
బెంబేలెత్తిస్తున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు!
గోవా గవర్నర్ గా రేపు అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..