Kiran Kumar Reddy: ఫార్ములా-1 రేసు కేసులో కీలకమైన అర్వింద్ కుమార్ అదృశ్యం
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:07 AM
ఫార్ములా వన్ రేసు కేసులో కీలకమైన ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ అదృశ్యంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

భువనగిరి ఎంపీ చామల అనుమానం
కుట్రలూ కుతంత్రాలకు నిలయం కేటీఆర్ అని ఆరోపణ
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా వన్ రేసు కేసులో కీలకమైన ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ అదృశ్యంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అర్వింద్‌కుమార్ అందుబాటులో లేనందున ఏసీబీ విచారణలో తనకేమీ కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమాతో ఉన్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులతో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కుట్రలూ కుతంత్రాలకు నిలయమని ఆరోపించారు. ఫార్ములా వన్ రేసులో కీలకమైన అర్వింద్ కుమార్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని ఎంపీ చామల పేర్కొన్నారు. ఫార్ములా వన్ రేసు విచారణ సందర్భంగా అర్వింద్ కుమార్‌ను విదేశాలకు పంపారా..? మరెక్కడైనా దాచిపెట్టారా..? అన్న విషయం బహిర్గతం కావాల్సి ఉందని చెప్పారు. వాస్తవంగా అందుబాటులో ఉంటే అర్వింద్ కుమార్ స్వయంగా చెప్పుకుంటారన్నారు. కేటీఆర్ మిత్రుడు కేదార్ గతంలో విదేశాల్లోనే చనిపోయారని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్ ప్లాన్‌తోనే ప్రభాకర్‌రావు ఏడాదిన్నర కాలంగా అమెరికాకెళ్లి దాక్కున్నారని ఆరోపించారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడినందు వల్లే కేటీఆర్‌పై విచారణ జరుగుతున్నదన్నారు. ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్.. సినిమాలో మహేశ్ బాబు మాదిరి డైలాగ్‌లు కాపీ కొడుతూ హీరోలా ఫీలవుతున్నారని ఎంపీ చామల ఎద్దేవా చేశారు. ఆయనవన్నీ సినిమా డైలాగులేనని, ఆయన మాటల్లో ఒక్కటీ నిజం కాదని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందన్నారు. అరెస్టు కావడానికే ఆయన ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని చామల ఎద్దేవా చేశారు. జైలుకెళ్తేనే సీఎం అవుతారనే ట్రెండ్‌ను కేటీఆర్ బలంగా నమ్ముతున్నారని విమర్శించారు. ఢిల్లీ జైలుకు కవిత వెళ్లిందని, తాను హైదరాబాద్‌లో జైలుకెళితే తానే సీఎం అవుతానని సన్నిహితుల వద్ద కేటీఆర్ చెబుతున్నారని ఆయన అన్నారు. అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్ వలే తనకు తాను ఫీల్ అవుతున్న కేటీఆర్ ఉద్యమ కారుడు కాదని స్పష్టం చేశారు. గతంలో జైలుకెళ్లానని, ఎన్నిసార్లైనా జైలుకెళ్తానని డైలాగులు చెబుతున్న కేటీఆర్.. ఎప్పుడు జైలుకెళ్లారని ప్రశ్నించారు. గత జన్మలో దక్షిణాఫ్రికాలో గాంధీజీతో కలిసి జైలుకెళ్లారా? అని ఎద్దేవా చేశారు. తమ అవసరాల కోసం చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు ఏమైనా చేస్తారని ఆయన ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News