Share News

Congress: కేసీఆర్‌ను విలన్‌ను చేస్తున్న హరీశ్‌

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:42 AM

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను విలన్‌ను చేసే ప్రయత్నం.. ఆయన మేనల్లుడు హరీశ్‌రావు చేస్తున్నాడంటూ కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Congress: కేసీఆర్‌ను విలన్‌ను చేస్తున్న హరీశ్‌

  • బనకచర్ల ప్రాజెక్టుకు హరీశే కారణం: చామల

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను విలన్‌ను చేసే ప్రయత్నం.. ఆయన మేనల్లుడు హరీశ్‌రావు చేస్తున్నాడంటూ కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు వైఖరి వల్లనే ఏపీ నాయకులు బనకచర్లకు నీళ్లు తరలించుకునే ఆలోచన చేశారన్నారు. గోదావరి జలాలపై గొంతు చించుకుంటున్న బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు.. కృష్ణా జలాలపై ఎందుకు మాట్లాడట్లేదంటూ నిలదీశారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నాయకులు కనీస అవగాహనతో ప్రాజెక్టులు కడితే బాగుండేదన్నారు.


కాళేశ్వరం కూలిన తర్వాత తెలంగాణ ప్రజలకు వీళ్ల సంగతి పూర్తిగా అర్థమైందన్నారు. కేసీఆర్‌కు ఉన్న అపారజ్ఞానం వల్లే కాళేశ్వరం కూలేశ్వరంగా మారి పోయిందని ఎద్దేవా చేశారు. జగన్‌ రెడ్డితో నాలుగుసార్లు మంతనాలు జరిపి.. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్‌ అన్నారు. హరీశ్‌రావుకు కంటెంట్‌ కంటే ఆవేశమే ఎక్కువన్నారు. నదీ జలాలు ఎవరి అయ్య జాగీరు కాదన్న సంగతి హరీశ్‌రావు తెలుసుకోవాలన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 03:42 AM