Share News

siricilla : ఇంకిన కన్నీటి ధారల్లో.. జ్ఞాపకాలు కదలాడే..

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:49 AM

మెట్ట ప్రాంతానికి జలకళకు దారులు వేస్తూ.. అభివృద్ధి చక్రాల కింద నలిగిపోయిన గ్రామాల్లోని నిర్వాసితుల కన్నీటి ధారలు ఇంకిపోయాయి. కాళేశ్వరం జలాల ఎత్తిపోతలతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు జలకళ వచ్చింది.

siricilla :   ఇంకిన కన్నీటి ధారల్లో..  జ్ఞాపకాలు కదలాడే..

- నీట మునిగిన ముంపు గ్రామాలు తేలాయి

- డెడ్‌ స్టోరేజీ దిశగా మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌

- అనంతగిరి ప్రాజెక్ట్‌లో పడిపోయిన నీటి మట్టాలు

- ప్రాజెక్ట్‌ నిర్మాణంలో 11 గ్రామాలు, 19,446 ఎకరాల భూమికి ముప్పు

- జిల్లాలో 11.27 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు

- మిడ్‌ మానేరులో 7.041 టీఎంసీలు... అనంతగిరిలో 1.23 టీఎంసీలు

- తమ ఊళ్లను చూసుకుంటున్న నిర్వాసితులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

మెట్ట ప్రాంతానికి జలకళకు దారులు వేస్తూ.. అభివృద్ధి చక్రాల కింద నలిగిపోయిన గ్రామాల్లోని నిర్వాసితుల కన్నీటి ధారలు ఇంకిపోయాయి. కాళేశ్వరం జలాల ఎత్తిపోతలతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు జలకళ వచ్చింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఏర్పడ్డ లోపాలతో ఎత్తిపోతలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌కు ఆగిన జలధారతో వెలవెలబోతోంది. నిర్వాసితుల్లో మరోసారి జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. జిల్లాలోని మానేరు వాగుపై బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో 11 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 7419 ఇళ్లు, 19,446 ఎకరాల వ్యవసాయ భూములు, ముంపునకు గురికాగా, 10,131 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. పరిహారం కోసం అనేక ఆందోళనలు నిర్వహించారు. ప్రాజెక్ట్‌లో నీళ్లను నింపడానికి బలవంతంగా ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయించారు. ఎన్నో బాధల మధ్య నిర్వాసితులు తరలివెళ్లారు. తాత, ముత్తాతల నాటి భూములు, ఇళ్లలో పెరిగిన వ్యక్తులు ఆ జ్ఞాపకాలను వదలలేక ఇబ్బందులు పడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల సమయంలో మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ పరిధిలో 18 కిలోమీటర్ల మేరకు జలకళతో కనిపించింది. 11 గ్రామాలు నీళ్లలో ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ అడుగంటిపోయింది. డెడ్‌ స్టోరేజీ దిశకు ప్రాజెక్ట్‌ చేరింది. 27.55 టీఎంసీ సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 7.041 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దీనికి అనుబంధంగా నిర్మించిన ప్రాజెక్ట్‌లలో అనంతగిరి గ్రామంలోని అన్నపూర్ణ ప్రాజెక్ట్‌ కూడా జిల్లాలోని ఇల్లంతకుంటలోనే ఉంది. 3.50 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ప్రాజెక్ట్‌లో 1.23 టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్టు నిర్మాణంలో అనంతగిరి గ్రామం ముంపునకు గురయ్యింది. 3,947 ఎకరాల భూమి, 1,124 కుటుంభాలు తరలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాజెక్ట్‌ నీళ్లు అడుగంటడంతో అనంతగిరి జ్ఞాపకాలు కూడా కళ్ల ముందుకు వచ్చాయి. మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌ పరిఽధిలో ముంపునకు గురైన ఊళ్లు మరోసారి నీళ్లు అడుగంటి బయటకు రావడంతో ఆనాటి దేవాలయాలు, తాము చదువుకున్న బడిని చూసి స్నేహితులతో అటలాడుకున్న స్థలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తేలిన దేవాలయాల్లో నాటి పూజల వైభవాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. వృద్ధులు సైతం ప్రాజెక్ట్‌ ముంచేసిన జ్ఞాపకాలు మళ్లీ తెరపైకి రావడంతో ఉద్విగ్నానికి లోనవుతున్నారు. జిల్లాలోని మిడ్‌ మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లలో నిర్వాసితులుగా మారిన వారికి మరోసారి తాము పడిన బాధలు, త్యాగాలన్నీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. మరోవైపు జిల్లాలో భూగర్భ జలాలు పడిపోవడంతో యాసంగి సాగు కూడా చివరి దశలో ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో సరాసరి 11.25 మీటర్ల లోతులోకి నీటి మట్టాలు పడిపోయాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో 17.85 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిన తీరు (మీటర్లలో )

మండలం మార్చి 2024 మార్చి 2025

బోయినపల్లి 7.52 8.17

చందుర్తి 8.46 7.25

గంభీరావుపేట 10.70 12.90

ఇల్లంతకుంట 9.00 7.53

కోనరావుపేట 11.41 11.91

ముస్తాబాద్‌ 13.48 13.42

రుద్రంగి 9.19 8.50

సిరిసిల్ల 13.19 14.28

తంగళ్లపల్లి 10.37 9.88

వీర్నపల్లి 26.84 15.22

వేములవాడ రూరల్‌ 6.07 5.84

వేములవాడ అర్భన్‌ 15.20 16.52

ఎల్లారెడ్డిపేట 16.68 17.84

------------------------------------------------------------------------------------

జిల్లా సరాసరి 11.81 11.27

------------------------------------------------------------------------------------

Updated Date - Apr 28 , 2025 | 12:49 AM