నవోదయ విద్యాలయాన్ని నెలకొల్పాలి
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:51 AM
పెద్దపల్లి జిల్లా ఏర్పాటై ఎనమిదిన్నరేళ్లు గడుస్తున్నా కూడా కేంద్రీయ నవోదయ విద్యాలయానికి నోచుకోలేదు. గతంలో ఉన్న విద్యాలయాలకు తోడు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు కొత్తగా నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది.

- జిల్లా ఏర్పాటై ఎనిమిదేళ్లు గడిచినా మంజూరు లేదు
- సీబీఎస్‌ఈ విద్యకు నోచుకోని పేద, మధ్య తరగతి విద్యార్థులు
- ఎంపీ, మంత్రులు దృష్టి సారించాలి
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పెద్దపల్లి జిల్లా ఏర్పాటై ఎనమిదిన్నరేళ్లు గడుస్తున్నా కూడా కేంద్రీయ నవోదయ విద్యాలయానికి నోచుకోలేదు. గతంలో ఉన్న విద్యాలయాలకు తోడు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు కొత్తగా నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే వాటిని ఆరంభిస్తున్నారు. తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాత ఉమ్మడి జిల్లాలకు ఒక్కో నవోదయ విద్యాలయం కొనసాగుతున్నది. కరీంనగర్ జిల్లా చొప్పదండి, ఆదిలాబాద్. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూల్, మెదక్ జిల్లా సిద్దిపేట, నల్గొండ, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు కొనసాగుతున్నాయి. కొత్తగా నిజామా బాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మేడ్చల్ మల్కా జిగిరి, మహబూబ్‌నగర్, సూర్యాపేట్, సంగారెడ్డి జిల్లా లకు నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అప్పటి ముఖ్యమంత్రి పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్ జిల్లా మినహా 9 ఉమ్మడి జిల్లాలను విభజించారు. మొత్తం 33 జిల్లాలతో రాష్ట్రం నడుస్తున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలుగా విడి పోయింది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే నవోదయ పాఠశాల ఉండగా, తాజాగా జగిత్యాల జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు కాగా, ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ఆరంభం అవుతు న్నాయి. పెద్దపల్లి జిల్లాకు నవోదయ విద్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుక రాకపోవడం వల్లనే జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు కాలేదు. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలు మినహా యిస్తే బీజేపీ ఎంపీలు ప్రాతినిఽధ్యం వహిస్తున్న పార్ల మెంట్ నియోజకవర్గాల పరిధిలోని జిల్లాలకు నవోదయ విద్యాలయాలు మంజూరు చేశారు.
ఫ సీబీఎస్‌ఈ బోధనకు నోచుకోని విద్యార్థులు
పెద్దపల్లి జిల్లా పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా వృద్ధి చెందుతున్నప్పటీకీ, పేద, మధ్య తరగతి కుటుం బాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పరంగా సీబీ ఎస్‌ఈ విద్యకు నోచుకోవడం లేదు. జిల్లాలో ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, సింగరేణి, రైస్ ఇండస్ట్రీస్ వంటివి అనేక పరిశ్రమలున్నాయి. నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన చేస్తారు. ఒకసారి సీటు దక్కించుకున్న విద్యార్థి ఇంటర్ పూర్తి చేసిన తర్వాతనే బయటకు వస్తారు. ఇక్కడ హాస్టల్ వసతితోపాటు సైన్స్, గణితంలో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దుతారు. అంతేగాకుండా కో కరిక్యులమ్ యాక్టి విటీ, కమ్యూనిటీ సర్వీస్, సోషల్ ఈక్విటీ, తదితర అంశాలపై విద్యార్థులకు సమాజం పట్టు ఉండేలా, మానవత్వంతో వ్యవహరించేలా విద్యా బోధన చేయడం తో పాటు కార్యక్రమాలు నిర్వహిస్తారు. నవోదయ విద్యాలయాల్లో చదువుకున్న అనేక మంది ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలను సాధించారు. 80 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొలువులు సాధించారు. ఇక్కడ ఎలాంటి ఒత్తిడి లేకుండా నాణ్యమైన అందించడమే కారణమని పూర్వ విద్యార్థులు చెబుతుంటారు. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన పెద్దపల్లి జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు కాకపోవడంతో సీబీఎస్‌ఈ విద్యకు నోచుకోవడం లేదు. సీబీఎస్‌ఈ విద్య చదవాలంటే ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. అంత స్తోమత పేద, మధ్య తరగతి కుటుంబాలకు లేదు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా వ్యవహరిస్తున్న గడ్డం వంశీకృష్ణ, జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు దృష్టి సారించి వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా జిల్లాకు నవోదయ విద్యాల యం మంజూరయ్యే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.