Share News

‘పీఎం ఉష’తో మహర్దశ

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:53 AM

గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ చేయాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌ (పీఎం ఉష) పథకంతో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ అటానమస్‌ కళాశాలకు మహర్దశ పట్టుకుంది. డిగ్రీ కళాశాల స్థాయి ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం, విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం ఉష పథకాన్ని అమలు చేస్తున్నది.

‘పీఎం ఉష’తో మహర్దశ

-ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి రూ.5 కోట్లు మంజూరు

-గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యం

-చురుగ్గా సాగుతున్న 12 అదనపు గదుల నిర్మాణం

-రూ.1.08 కోట్లతో సాంకేతిక విద్యా సామగ్రి కొనుగోలు

జగిత్యాల, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ చేయాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌ (పీఎం ఉష) పథకంతో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ అటానమస్‌ కళాశాలకు మహర్దశ పట్టుకుంది. డిగ్రీ కళాశాల స్థాయి ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడం, విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం, విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం ఉష పథకాన్ని అమలు చేస్తున్నది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పీఎం ఉష పథకానికి జగిత్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ అటానమస్‌ కళాశాల ఎంపికైంది. ఈ పథకం కింద కళాశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.3.92 కోట్ల నిధులు భవనాల నిర్మాణాలకు, రూ.1.08 కోట్లు సాంకేతిక విద్య సామగ్రి కొనుగోలు కోసం కేటాయించారు.

ఫఅటానమస్‌ హోదా

జగిత్యాలలో 1998 సంవత్సరంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. సుమారు 2.1 ఎకరాల్లో 30 గదులతో కళాశాల నిర్వహిస్తున్నారు. ఈ కళాశాల ఇటీవల బీ ప్లస్‌ ప్లస్‌, న్యాక్‌ గుర్తింపు పొందింది. కళాశాలలో డిజిటల్‌ ల్యాబ్‌, డిజిటల్‌ లైబ్రరీ, జిమ్‌, టీఎస్‌కేసీ సెంటర్‌ తదితర వసతులున్నాయి. ప్రస్తుతం కళాశాలలో వెయ్యి మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. కళాశాలలో బీఏ, బీకాం కంప్యూటర్స్‌, బీకాం కామర్స్‌, బీఎస్‌సీ, బీజడ్‌సీ, బీజడ్‌సీ కంప్యూటర్‌, ఎంపీసీఎస్‌ తదితర కోర్సుల్లో 38 మంది అధ్యాపకులు బోధన చేస్తున్నారు. న్యాక్‌ బృందం కళాశాలను పరిశీలించి ఇచ్చిన గ్రేడ్‌ ప్రకారం యూజీసీ పదేళ్ల పాటు స్వయం ప్రతిపత్తి హోదా (అటానమస్‌)ను కల్పిస్తూ గత యేడాది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంవత్సరం బ్యూటిషియన్‌ కోర్సును కూడా ఆరంభిస్తున్నారు. కంప్యూటర్‌ నాలెడ్జ్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. జగిత్యాల జిల్లాలో అటానమస్‌ హోదాను సాధించిన ఏకైక కళాశాలగా జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నిలిచింది. గత సంవత్సరంతో పోల్చితే అటానమస్‌ సాధించిన తర్వాత ఈ సంవత్సరం అడ్మిషన్లలో 19.1 శాతం ప్రగతిని సాధించింది. ఇటీవల విడుదల చేసిన రెండో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాల్లో సైతం శాతవాహన విశ్వవిద్యాలయం ఫలితాల కంటే 24 శాతం అధికంగా సాధించింది.

ఫమౌలిక వసతుల కల్పన

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో అదనంగా రెండు వేర్వేరు భవనాలు రెండు అంతస్తులతో నిర్మిస్తున్నారు. మొదటి భవనంలో నాలుగు, రెండో భవనంలో ఎనిమిది మొత్తంగా 12 అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆయా గదుల నిర్మాణ పనులు ప్రారంభం కాగా వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. నిర్మాణ బాధ్యతలను టీజీఈడబ్ల్యూఐడీసీ పర్యవేక్షిస్తోంది. పీఎం ఉష పథకం కింద రూ.1.08 కోట్ల నిధులతో 60 కంప్యూటర్లు, 22 డిజిటల్‌ స్మార్ట్‌ బోర్డులు, 3 స్కానర్లు, 4 ప్రింటర్లు, 5కేవీ సామర్థ్యం గల మూడు యూనిట్ల బ్యాటరీ యూపీఎస్‌లు, 60 కంప్యూటర్‌ టేబుళ్లు, 60 కుర్చీలు మొదలైనవి సమకూర్చారు. ఇప్పటికే వీటిలో ఎనిమిది డిజిటల్‌ స్మార్ట్‌ బోర్డులు, కంప్యూటర్లు ఇతరత్రా సాంకేతిక డిజిటల్‌ సామగ్రిని కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం వినియోగంలోకి తీసుకువచ్చారు. అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పూర్తయితే అన్ని రకాల హంగులతో కార్పొరేట్‌ స్థాయిలో డిగ్రీ విద్య అందనుంది. పీఎం ఉషా పథకంతో కళాశాలకు మహర్దశ పట్టనుంది.

మారనున్న కళాశాల రూపురేఖలు..

-రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్‌, జగిత్యాల

పీఎం ఉష కింద మంజూరైన నిధులతో కళాశాలలో వసతులు మెరుగు పడనున్నాయి. బీఎస్సీ, బీకాం, కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థుల కోసం కళాశాల సెమినార్‌ హాల్‌లో కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నాం. కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన అందించే ప్రయత్నం చేస్తున్నాం. 12 అదనపు తరగతి గదుల నిర్మాణం తర్వాత మరింత మెరుగైన గుణాత్మక విద్యను విద్యార్థులకు అందిస్తాం.

పనుల్లో నాణ్యత ఉండేలా పర్యవేక్షణ

-జి.చంద్రయ్య, పీఎం ఉష కళాశాల కోఆర్డినేటర్‌, జగిత్యాల

పీఎం ఉష కింద మంజూరైన నిధులతో చేపట్టే అదనపు తరగతి గదుల నిర్మాణాలు టీజీఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్ల సహకారంతో నాణ్యతగా జరిగేలా పర్యవేక్షిస్తాం. మొదటి భవనానికి మొదటి స్లాబ్‌ నిర్మాణం పూర్తి అయ్యింది. రెండవ భవన నిర్మాణం ఇంకా పునాది దశలో ఉంది. వచ్చే విద్యా సంవత్సరం వరకు ఈ అదనపు తరగతి గదులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చేలా కృషి చేస్తాం.

Updated Date - Aug 03 , 2025 | 12:53 AM