jagitiala : నీటి బొట్టు.. ఒడిసి పట్టు
ABN , Publish Date - Apr 28 , 2025 | 01:09 AM
జగిత్యాల, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఇంకుడు గుంతలను నిర్మించి ప్రతి నీటి బొట్టును ఒడిసి పడితేనే వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేయవచ్చు. భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.

-ఇంకుడుగుంతలు తవ్వేందుకు అనువైన సమయం
-అవగాహన లోపంతో ముందుకు రాని ప్రజలు
-మున్సిపాలిటీల్లో నెరవేరని లక్ష్యం
-ప్రజలకు అవగాహన కల్పించాలని నిపుణుల సూచన
జగిత్యాల, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ఇంకుడు గుంతలను నిర్మించి ప్రతి నీటి బొట్టును ఒడిసి పడితేనే వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేయవచ్చు. భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే మున్సిపాలిటీల్లోనూ, ఇతర సామాజిక స్థలాల్లోనూ వీటిని తవ్వించాలని సూచించింది. ఐదేళ్ల కిందట పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసింది. కానీ అప్పటి నుంచి నేటి వరకు పనుల జాడే లేకుండా పోయింది. వర్షపు నీరంతా మురుగు కాల్వల్లో వృథాగా పోతోంది. ఇళ్లలోనూ ఇంకుడుగుంతల నిర్మాణానికి ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతో చాలా మంది ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇళ్లలో నిర్మించిన వాటిని బాగు చేయడంతో పాటు కొత్తవాటిని నిర్మిస్తే ప్రతి నీటి బొట్టును వృథా కాకుండా అరికట్టే అవకాశాలున్నాయి.
ఫస్థలమున్నా స్పందన కరువు
జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో విశాలమైన స్థలం ఉంది. ఆయా ప్రాంతాల్లో వీటిని తవ్విస్తే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవకాశం కలుగుతుంది. మూడేళ్ల కిందట సర్కారు మున్సిపాలిటీల వారీగా లక్ష్యాలను విధించింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో సుమారు 3 వేల ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు గతంలో సూచించారు. ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.6 వేల నుంచి రూ.8 వేల దాకా ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రధానంగా ప్రభుత్వ స్థలాలు, బస్టాండ్లు, వ్యవసాయ మార్కెట్లు, పాఠశాలలు, కళాశాలలు, పార్కులు, నీటి ట్యాంకులు ఇతర ప్రభుత్వ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు లక్ష్యం విధించినా, కనీసం పదిశాతం కూడా కార్యదూపం దాల్చలేదు. పలు మున్సిపల్ కార్యాలయాలతో పాటు, ఎంపీడీవో, పోలీసు స్టేషన్, రెవెన్యూ కార్యాలయాల ఆవరణలో నిర్మించిన ఇంకుడుగుంతలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. జిల్లా కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఫనీటి ఎద్దడితో సతమతం..
ఎండలతో భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయాయి. గతంలో తవ్విన వాటిని సత్వరం బాగు చేసి వినియోగంలోకి తీసుకువస్తేనే నీటి వృద్ధికి మార్గం సుగమం అవుతుంది. ఆయా మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో నీటి ఎద్దడి చాయలు కనిపిస్తున్నాయి. పలు కాలనీల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఆరు వందల నుంచి ఎనిమిది వందల అడుగుల లోతు బోర్లు తవ్వినా చుక్క నీరు రావడం లేదు. దీంతో యజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గృహాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు తవ్వేందుకు ఇదే సరైన సమయమని సంబంధిత అధికార వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఇంకుడుగుంతలు ఏర్పాటు చేస్తే రానున్న వర్షాకాలంలో ప్రతీ నీటిబొట్టును పొదుపు చేసుకునే అవకాశాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఫకొరవడిన భాగస్వామ్యం...
వానాకాలంలో అన్ని చోట్లా వర్షపు నీరు ప్రధాన రహదారులు, ఇళ్లలోకి చేరి కునుకు లేకుండా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విరివిగా ఇంకుడు గుంతలను తవ్విస్తే ఎద్దడి సమస్యను అధిగమించడంతో పాటు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉంటుంది. ఒకటిన్నర మీటర్ల లోతు, రెండున్నర మీటర్ల వెడల్పు, లేదా రెండు మీటర్ల లోతు, మూడు మీటర్ల వెడల్పు ఉండేలా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం వార్డుల వారీగా కమిటీలు కూడా పూర్తి చేయాలని గతంలో సూచించినా అడుగు ముందుకు పడలేదు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ తదితర శాఖలకు సంబంధించిన అధికారులు స్థలాల ఎంపికను చేపట్టాల్సి ఉన్నా దృష్టి సారించడం లేదు. ఇంకుడుగుంతల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది. పాత గృహాల్లోనూ, కొత్త ఇళ్ల నిర్మాణాల్లోనూ తవ్వించడంపై దృష్టి సారించి ఆ దిశగా ప్రజలల్లో మార్పు తీసుకొని వస్తేనే భవిష్యత్తులో నీటి సమస్యలు ఎదుర్కొనే వీలు కలుగుతుంది.