Share News

Karimnagar Congress: కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు..!

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:08 AM

Karimnagar Congress: కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందెం మొదలైంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం జిల్లా వర్కింగ్ ప్రెసి‌డెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పార్లమెంట్ స్థానానికి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్రావు, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుర్ర సత్యప్రసన్నరెడ్డి, సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు.

Karimnagar Congress: కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు..!
Karimnagar Congress Leaders

ఆంధ్రజ్యోతి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ (Congress Party) సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడంతో పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అధికారంలో లేకపోవడం, ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చినా ఆటు సంస్థాగత పదవులు గానీ, ఇటు నామినేటెడ్ పదవులు (Nominated Posts) దక్కక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, క్రియాశీల కార్యకర్తలు, గ్రామీణస్థాయి నాయకుల్లో ఇప్పుడు ఉత్సాహం మొదలైంది. పార్టీ ఆధిష్టానవర్గం సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడమే కాకుండా ఉమ్మడి జిల్లాల స్థాయిలో (Karimnagar) ఇన్చార్జీలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించడంతో వారు తమకు అప్పగించిన బాధ్యతల్లో పనిచేయడం ప్రారంభించారు.. ఉమ్మడి జిల్లా సంస్థాగత ఇన్చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లాల్లో పర్యటన ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక జిల్లా ఉపాధ్యక్షున్ని, ప్రతి బ్లాక్ నుంచి ఒక ప్రధాన కార్యదర్శిని, ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శిని తీసుకుంటామని ప్రకటించారు. క్షేత్రస్థాయి నేతలు ఆయా పదవుల క్రీడ కోసం అప్పుడే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా తీవ్రమైన పోటీ నెలకొన్నది.


ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేతలు..

సంస్థాగత ఇన్చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పా టు చేయడంతో డీసీసీ పదవిని ఆశిస్తున్నవారు అలర్ట్ అయి అందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధానంగా పదవి కోసం ప్రస్తుతం కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసి‌డెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పార్లమెంట్ స్థానానికి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్రావు, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుర్ర సత్యప్రసన్నరెడ్డి, సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు


వీరంతా వారి వారి స్థాయిల్లో ఆటు మంత్రులతో, పార్టీలో కీలక నేతలతో కలిసి తమకు పదవి, లభించేలా చూడాని కోరుతున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జిల్లాలోనే ఉన్న అద్దంకి దయాకర్‌ను కలిసి తాను ఎన్ఎస్ఈయూఐ నుంచి పార్టీ ప్రస్థానం ప్రారంభించి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరకు వచ్చి అంకితభావంతో పనిచేస్తున్నానని, మార్కెట్ కమిటీ చైర్మన్ గా, మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా గత రెండు దశాబ్దాలుగా సేవలందించానని, తన కష్టాన్ని గుర్తించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి..

హంద్రీ - నీవా కాల్వలకు నీరు విడుదల

జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఫైర్

Updated Date - Jul 18 , 2025 | 11:27 AM