రసాభాసగా కాంగ్రెస్ సమావేశం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:47 AM
కాంగ్రెస్ జిల్లా సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం రసాభాసగా మారింది.

- గలాటకు దారితీసిన పురుమల్ల వ్యాఖ్యలు
- వేదికపైనే నేతల తోపులాట
- ఏఐసీసీ కార్యదర్శి సహనానికి పరీక్ష
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కాంగ్రెస్ జిల్లా సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సమావేశంలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ విశ్వనాథన్ పెరుమాళ్, జిల్లా పరిశీలకులు నమిండ్ల శ్రీనివాస్, పి రఘునాథ్‌రెడ్డి సమక్షంలోనే పురుమల్ల శ్రీనివాస్ తాము నామినేటెడ్ పదవుల విషయంలో ఏ ప్రతిపాదనలు టీపీసీసీకి పంపించినా ఒక దుర్మార్గుడు అడ్డుకుంటున్నాడని అన్నారు. ఇప్పటికీ నాలుగైదు ప్రతిపాదనలకు అదేగతి పట్టిందని ఆయన చేసిన వ్యాఖ్యలు సమావేశంలో ఒకరినొకరు తోసేసుకునే స్థాయికి వెళ్లి ఏఐసీసీ కార్యదర్శి సహనానికి పరీక్ష పెట్టాయి.
ఫ ఒకరినొకరు నెట్టుకున్న నేతలు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శితోపాటు జిల్లా పరిశీలకులు హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్ పార్టీకి కార్యకర్తలే దేవుళ్లని, అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంతో వారిలో అసంతృప్తి పెరిగిపోతున్నదని అన్నారు. తాను కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ పదవికి వైద్యుల అంజన్‌కుమార్ పేరును ప్రతిపాదిస్తూ మరికొందరిని సభ్యులుగా సూచిస్తూ టీపీసీసీకి పంపించిన ఒక దుర్మార్గుడు హైదరాబాద్‌లో అడ్డుకున్నాడని, ఇలాగే నాలుగైదు ప్రతిపాదనలకు కూడా ఆపేశారని ఆరోపించారు. గతంలో కూడా పురుమల్ల శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ప్రస్తుతం కూడా ఆయన మంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడారని భావించిన ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, యూత్ కాంగ్రెస్ నాయకుడు బోనాల శ్రీనివాస్ తదితరులు పురుమల్లను అడ్డుకుంటూ ఆ దుర్మార్గుడెవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒక దశలో వేదికపైనే ఒకరినొకరు తోసుకుంటూ తీవ్ర గందరగోళ పరిస్థితిని సృష్టించడంతో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి వారందరిని స్టేజీ కిందకు నెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరగంట సేపు సమావేశాన్ని నిలిపివేసి ఆ తర్వాత కొనసాగించాల్సి వచ్చింది. పురుమల్ల శ్రీనివాస్ తన ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నాడని గతంలో కూడా మాట్లాడిన నేపథ్యంలోనే మంత్రి వర్గీయులు పురుమల్ల మాట్లాడుతుండగా అడ్డు తగిలారు.
ఫ పార్టీ తీరుపై అసంతృప్తి
ఆ తర్వాత మాట్లాడిన వారంతా అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం పని చేస్తూ వచ్చి పార్టీని ప్రజల్లో బతికిస్తూ వచ్చినవారికి అవకాశాలు ఇవ్వడం లేదని, పార్టీ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నుంచి వచ్చిన పారాచూట్ నేతలు లాబీలు చేసి పదవులు పొందుతున్నారని ఆక్షేపించారు. వక్తలందరూ పార్టీ వ్యవహరిస్తున్న తీరును దుయ్యబడుతూనే పురుమల్ల శ్రీనివాస్ లైన్‌లోనే మాట్లాడారు. పురుమల్ల మాత్రం గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరేకంగా బాహాటంగానే మాట్లాడి ప్రత్యేక సమావేశాన్ని డీసీసీ కార్యాలయంలోనే నిర్వహించారు. ఆ సందర్భంలోనే ఆయన మాట్లాడిన మాటలు పార్టీలో కలకలం రేకెత్తించాయి. కొందరు కాంగ్రెస్ నాయకులు దీనిపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేయగా, క్రమశిక్షణ కమిటీ ఆయను షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దానికి పురమల్ల జవాబు కూడా ఇచ్చారు. ఆ వివాదానికి అప్పుడు తెరపడింది. మళ్లీ ఇప్పుడు ఆయన దుర్మార్గుడు అని చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా మంత్రినుద్దేశించే అనే భావనకు వచ్చిన కొందరు సంస్థాగత నిర్మాణ సమావేశాన్ని రసాభాసాగా మార్చారు. దీంతో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పార్టీ లైన్ తప్పిన వారిని ఉపేక్షించేది లేదు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించే పరిస్థితి ఏర్పడింది.
ఫ పోటాపోటీగా నినాదాలు
సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ జిందాబాద్ అని ఆయన వర్గీయులు, పురుమల్ల జిందాబాద్ అంటూ ఈయన వర్గీయులు నినాదాలు చేసుకుంటూ వెళ్లడం కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదమెలా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులు, పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంపై అసహనానికి గురవుతున్నారని వెల్లడైంది. కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీ నాయకులను, శ్రేణులను సమన్వయ పరిచేవారు లేరనే అభిప్రాయం వ్యక్తమయింది.