వధువుల వేట..
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:49 AM
పెళ్లి వేడుక ప్రతి కుటుంబంలో అతి ముఖ్యమైన సంబరం. పెళ్లంటే నూరేళ్ల పంటగా భావిస్తారు. కల్యాణం కమనీయంగా ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పెళ్లి తంతు కోసం దూరతీరాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు తరలివస్తారు. ఈనెల నుంచి పెళ్లి ముహూర్తాలు ఎన్నో ఉన్నాయి.

- జిల్లాలో పెరుగుతున్న పెళ్లి కాని యువకుల సంఖ్య
- ఈడు దాటిపోతున్నా ఆర్థిక స్థిరత్వం కోసం తండ్లాట
- శ్రావణ మాసంలో భారీగా శుభముహూర్తాలు
- ఆదివారం ప్రత్యేకం
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పెళ్లి వేడుక ప్రతి కుటుంబంలో అతి ముఖ్యమైన సంబరం. పెళ్లంటే నూరేళ్ల పంటగా భావిస్తారు. కల్యాణం కమనీయంగా ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పెళ్లి తంతు కోసం దూరతీరాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు తరలివస్తారు. ఈనెల నుంచి పెళ్లి ముహూర్తాలు ఎన్నో ఉన్నాయి. రాజన్న సిరిసిల్లలో పెళ్లి వేడుకలకు సిద్ధమయ్యారు. ఈనెలలో 3,5,7,8,,9,10,11,12,13,14,17,18, సెప్టెంబరులో 24,27, అక్టోబరులో 5,8,11,12,24,26,27,29,30,31, నవంబరులో 1,7,8,13,15,,23,26 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ, కార్తీక మాసాలు ముహూర్తాలకు నెలవు. కానీ వధువు ఎక్కడ అనే పరిస్థితుల్లో అబ్బాయిలు ఆరాట పడుతున్నారు. మరోవైపు తల్లిదండ్రులు ‘మా అబ్బాయి... ఎంటెక్ అయిపోయింది. సంవత్సరానికి 3లక్షలకు పైగా సంపాదన వస్తోంది. ఎక్కడైనా అమ్మాయి ఉంటే చెప్పండి’.. అంటూ సూచిస్తున్నారు. ‘మా వాడు అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్.. పట్టింపులేవి లేవు.. కట్నకానుకలు అవసరంలేదు.. అమ్మాయి అందంగా ఉంటే చాలు..’ అంటూ వధువుల కోసం వెతుకులాడుతున్న సందర్భాలు జిల్లాలో అనేకం కనిపిస్తున్నాయి. కారణం చదువు, ఉద్యోగం ఆర్థికంగా స్థిరపడిన తరువాత వివాహం ఆలోచనలోకి వెళ్లడంతో అబ్బాయిలు ముదిరిపోయి పెళ్లి కాని ప్రసాద్‌లుగా మారిపోతున్నారు. మరోవైపు ఆడ శిశువు అనగానే గర్భంలోనే చంపేస్తున్న ఘటనలతో అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జీవితాంతం ఆనందమయంగా గడపాలని అందరూ కోరుకుంటారు. తమ జీవితాన్ని ఆకర్షణీయంగా ఉండాలని ఆశిస్తారు. అందుకోసం ఉద్యోగం, డబ్బు సంపాదనే ముఖ్యమనే తత్వంతో యువకులు ఉండిపోతున్నారు. అదేక్రమంలో యువతులు కూడా చక్కని ఉద్యోగం చేసే భర్త కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే జీవితంలో స్థిరపడాలనే తపనతో ఈడుదాటిపోవడంతో యువకులు వధువుల కోసం వెతుకులాడే పరిస్థితి పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా ‘ఎక్కడైనా ఆడపిల్ల ఉంటే చెప్పండి.. మా వాడు సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నాడు..’ అంటూ తల్లిదండ్రులు అడుగుతున్న తీరు తరచూ కనిపిస్తోంది. గతంలో ఉన్న పట్టింపులను కూడా మరిచి, రాశి, నక్షత్రం, గోత్రం వంటి వాటిపై పట్టింపులు లేకుండా అమ్మాయి బాగుంటే చాలని అడుగుతున్న వారు కూడా ఉన్నారు. మరోవైపు సంపాదనలో ఉన్న యువకులు మరో సంపాదించే అమ్మాయే భార్యగా రావాలని కోరుంటున్న వారు కూడా ఉన్నారు. దీంతో అందమైన పిల్ల, ముల్లె రెండూ ఒకచోట లభించక కూడా పెళ్లి సంబంధాలు చూస్తుండడంతోనే వయస్సు కాస్తా దాటిపోతోంది.
ఫ సహజీవనం మధురమైనది..
సహజీవనం అనేది ఒక మధురమైన జీవన విధానం. దాంపత్య జీవనం సరిగమలనే పలికించాలి. అపస్వరాలకు చోటివ్వకుండా సాఫీగా సాగిపోవాలి. కానీ చాలా కాపురాలు కుప్పకూలి పోతున్నాయి. అందుకు కారణం వయస్సు పైబడిపోయిన తరువాత వివాహాలు చేసుకోవడం.. ఇద్దరూ సంపాదన రంగంలో ఉండడం.. వంటి అంశాలు కూడా ముందుకు వస్తున్నాయి. గతంలో 18ఏళ్లలోపే ఏ పని చేసినా చేయకపోయినా పెద్దలు వివాహాలు జరిపించే వారు. ఇప్పుడు మారుతున్న కాలంలో ఉన్నత చదువులు, ఆర్థికంగా స్థిరపడిన తరువాతే వివాహం చేసుకోవాలని భావిస్తుండడంతోనే 40ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో చివరకు ఎవరైనా సరే అనుకున్నప్పటికి అమ్మాయిలు మాత్రం దొరకడం లేదు. కట్నకానుకలు పట్టింపులేదని అబ్బాయిలు ముందుకు వచ్చినా అమ్మాయిలు కనీసం డిగ్రీ చదివి ఉండాలని కోరుతున్నారు. ఉద్యోగులు కావాలని పిల్ల తల్లిదండ్రులు చూస్తుండడంతో వ్యాపార రంగంలో ఉన్న యువకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లి కాని ప్రసాద్‌ల సంఖ్య రోజురోజుకు పెరగడానికి మరో కారణం అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడమేనని లెక్కలు చెబుతున్నాయి. యువకులతో పోల్చుకుంటే యువతుల సంఖ్య తక్కువగా ఉండడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే మ్యారేజ్ బ్యూరోలు కూడా పెరిగిపోతున్నాయి. మ్యారేజ్ బ్యూరోల వద్ద అమ్మాయిలు కావాలనే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఒక మ్యారేజ్ బ్యూరోలో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది వధూవరులు పేర్లు నమోదు చేసుకుంటే, అందులో 30వేల మంది అబ్బాయిలు ఉండడం గమనార్హం.
ఫ లేటు వయస్సు పెళ్లిళ్లతో ఇబ్బందులు..
వయస్సు దాటిన తరువాత వివాహాలు చేసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. సరైన వయస్సులో వివాహం జరగకపోవడంతో పిల్లలు కలుగక మానసికంగా ఆందోళన చెందుతున్న సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి మరోవైపు పిల్లలు కలిగినా వారు చదువుకునే వయస్సులో.. తల్లిదండ్రుల వృద్ధాప్యంలోకి వెళ్లిపోవడంతో ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు.