Share News

Sridhar Babu: ఆ భూమి ప్రభుత్వానిదని సుప్రీంకోర్టే చెప్పింది

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:44 AM

కంచ గచ్చిబౌలి భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టే చెప్పిందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. చట్టానికి లోబడి దాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ఈ భూములపై బీఆర్‌ఎస్‌ నేతలు విష ప్రచారం చేశారన్నారు.

Sridhar Babu: ఆ భూమి ప్రభుత్వానిదని సుప్రీంకోర్టే చెప్పింది

  • చట్టానికి లోబడి కంచ గచ్చిబౌలి భూమిని కాపాడుకుంటాం

  • నకిలీ ఫొటోలు వ్యవస్థల్నీ ప్రభావితం చేశాయి

  • సుప్రీంకోర్టుపై గౌరవం ఉంది.. ఆదేశాలు పాటిస్తాం:మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలి భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టే చెప్పిందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. చట్టానికి లోబడి దాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ఈ భూములపై బీఆర్‌ఎస్‌ నేతలు విష ప్రచారం చేశారన్నారు. నకిలీ వీడియోలు, ఫొటోలు అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల తప్పుడు సమాచారాన్ని నమ్మిన కేంద్ర మంత్రులూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారన్నారు. ఆ తర్వాత వాటిని తొలగించారని గుర్తుచేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ప్రధాని మోదీ ఈ భూములపై మాట్లాడారన్నారు. సుప్రీం కోర్టుపై తమకు గౌరవం ఉందని, కంచ గచ్చిబౌలి భూములపై కోర్టు ఆదేశాలు తప్పక పాటిస్తామని చెప్పారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడబోనన్నారు. సుప్రీంకోర్టు అడిగిన ప్రతి అంశంపైనా వివరంగా సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జనావాసాల్లోకి నెమళ్లు రావడం సర్వసాధారణమన్నారు. ఈ భూమిలో వన్యప్రాణులంటే.. ఏనుగులు ఉన్నాయా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలికి సంబంధించి ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ పోస్టుపై చట్ట పరంగా ముందుకు వెళతామని చెప్పారు. గాంధీభవన్‌లో శ్రీధర్‌బాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూలగొడతామని బీఆర్‌ఎస్‌ మొదటి నుంచీ అంటోందని, ఆ మేరకు కుట్ర కూడా చేసిందని అన్నారు. తమ సర్కారు కూలగొడితే కూలిపోయేది కాదన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌, బీజేపీలు కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఏఐసీసీ సిద్ధాంతాలకు లోబడే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీనియర్‌ నేత జానారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణకు కట్టుబడి మాట్లాడే వ్యక్తి అని చెప్పారు. ధరణి భూముల వివాదంపై ఆడిటింగ్‌ జరుగుతుందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈడీ చార్జిషీటులో సోనియా, రాహుల్‌ పేర్లు చేర్చారని ఆరోపించారు.


ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే..

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌పై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేశారని టీపీసీసీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ పొన్నం అశోక్‌గౌడ్‌ అన్నారు. దేశంలో ప్రతిపక్షం బలంగా ఉండకూడదన్న దురుద్దేశంతోనే బీజేపీ సర్కారు అక్రమ కేసులతో వేధిస్తోందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను గౌరవిస్తున్నామని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. అయితే ఛత్తీ్‌సగఢ్‌ అడవుల నరికివేతపైనా కోర్టు స్పందించాలన్నారు. అక్కడ 2.72 లక్షల ఎకరాల్లో 9.20 లక్షల చెట్లను ఎలాంటి అనుమతులూ లేకుండా అదానీ కంపెనీ ఎలా నరికివేస్తోందని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్‍కు నోటీసులు.. విషయం ఏంటంటే..

Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..

Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..

Updated Date - Apr 17 , 2025 | 03:44 AM