Share News

Wanaparthy: పోలీసులకు పందుల దొంగల సవాల్‌ !

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:00 AM

అంతర్రాష్ట్ర పందుల దొంగల ముఠాలు వనపర్తి జిల్లా పోలీసులకు సవాలు విసురుతున్నాయి. తమను వెంబడిస్తున్న పోలీసుల నుంచి సినీఫక్కీలో తప్పించుకుంటున్నాయి.

Wanaparthy: పోలీసులకు పందుల దొంగల సవాల్‌ !

  • వనపర్తి జిల్లాలో రెచ్చిపోతున్న ముఠాలు

  • పోలీసు వాహనంపై పందిని విసిరి అడ్డుకునే యత్నం

అమరచింత, ఆగస్టు1 (ఆంధ్రజ్యోతి): అంతర్రాష్ట్ర పందుల దొంగల ముఠాలు వనపర్తి జిల్లా పోలీసులకు సవాలు విసురుతున్నాయి. తమను వెంబడిస్తున్న పోలీసుల నుంచి సినీఫక్కీలో తప్పించుకుంటున్నాయి. జిల్లాలోని ఆత్మకూరు, పెబ్బేరు, ఏదుట్ల, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో గత వారం పందులను దొంగలించి పరారైన ముఠాలు.. బుధవారం రాత్రి తమను వెంబడిస్తున్న అమరచింత పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి మరీ పరారయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బుధవారం అర్ధరాత్రి కొల్లాపూర్‌లో 40 పందులను దొంగలించిన దొంగల ముఠా స్థానిక పోలీసుల నుంచి తప్పించుకుని ఆత్మకూరు మీదుగా అమరచింత రావచ్చుననే సమాచారంతో ఆత్మకూరు, అమరచింత పోలీసులు అప్రమత్తమయ్యారు.


ప్రధాన రహదారులపై గస్తీ పెట్టారు. అయితే, ఆత్మకూరు చౌరస్తాలో పోలీసు బారికేడ్లను తమ బొలె రో వాహనంతో ఢీకొట్టి నాగల్‌కడుమూర్‌ గ్రామం వైపు వెళ్లిన దొంగలను అమరచింత పోలీసులు వెంబడించారు. అయితే, సినీ తరహాలో ఛేజింగ్‌ జరుగుతుండగా దొంగలు తమ వాహనంలోని ఓ పందిని పోలీసు వాహనంపైకి విసిరారు. దానిని తప్పించుకుని పోలీసులు వెంబడిస్తుండగా.. కత్తులు, కట్టెలు చూపించి పోలీసులను బెదిరించారు. ఆపై, ధర్మాపూర్‌, నాగల్‌కడుమూర్‌ గ్రామాల మధ్య వేగంగా వెనక్కి దూసుకొచ్చి పోలీసు వాహనాన్ని ఢీకొట్టి ధ్వంసం చేసి పరారయ్యారు. అయితే, ఆత్మకూరు సీఐ శివకుమార్‌ ఆధ్వర్యంలో మరో బృందం అమరచింత మీదుగా మరికల్‌ ప్రాంతం నుంచి దొంగలను నారాయణపేట వరకు వెంబడించినప్పటికీ తప్పించుకున్న దొంగలు కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా వైపు పరారయ్యారు.

Updated Date - Aug 02 , 2025 | 04:00 AM