Share News

Telangana Assembly: ఎల్లుండి నుంచి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

ABN , Publish Date - Oct 22 , 2025 | 07:39 PM

పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎల్లుండి నుంచి చివరి దశ విచారణలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 24 వ తేదీ నుంచి అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు..

Telangana Assembly:  ఎల్లుండి నుంచి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
Telangana Assembly

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ ప్రస్తుత రాజకీయాల్లో కీలక అంశంగా మారిన ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరుతోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎల్లుండి నుంచి చివరి దశ విచారణలు చేయబోతున్నారు. ఈనెల 24 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే విచారణల సమయంలో అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్-ఎగ్జామినేషన్ పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన కేసులు ఈ వారంలో ముగియనున్నాయి. భారత రాజ్యాంగ పదో అనుసూచి (ఫిరాయింపు నిరోధక చట్టం) ప్రకారం స్పీకర్ విచారణలు చేస్తున్నారు.


2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఫిరాయింపు ఆరోపణలు మొదలయ్యాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు స్పీకర్‌కు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29, 2025 నుంచి విచారణలు ప్రారంభమై, అక్టోబర్ 1 వరకు మొదటి దశ పూర్తయింది.

ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వంటి నలుగురు ఎమ్మెల్యేల క్రాస్-ఎగ్జామినేషన్ ముగిసింది. ఈ ఎమ్మెల్యేలు తమ తరపు న్యాయవాదులతో సహా స్పీకర్ ముందు హాజరై, తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని, ఫిరాయింపు జరగలేదని తమ వాదనలు వినిపించారు. అయితే, పిటిషనర్లైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాటికి సంబంధించిన ఆధారాలు, అఫిడవిట్లు, వీడియోలు సమర్పించారు.


ఇక, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈనెల 24వ తేదీ నుంచి మిగిలిన నాలుగు కేసులపై మౌఖిక వాదనలు వినాలని నిర్ణయించారు. ప్రతి కేసులో ఇరు వర్గాలు (పిటిషనర్లు, ప్రతివాదులు) తమ వాదనలు వినిపిస్తారు.

  • ఈనెల 24న ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్ కేసు విచారణ

  • మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య కేసు విచారణ

  • మధ్యాహ్నం రెండు గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి కేసు విచారణ

  • మధ్యాహ్నం మూడు గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసు విచారణ

  • ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో ఈనెల 24 నుంచి 31 వరకు అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు


ఇవి కూడా చదవండి..

అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 08:11 PM