HYDRAA: హైదరాబాద్లో మళ్లీ కొరడా ఝులిపిస్తోన్న హైడ్రా
ABN , Publish Date - Apr 19 , 2025 | 08:20 PM
భాగ్యనగరంలో హైడ్రా ఇవాళ మళ్లీ తన జులుం విదిల్చింది. హైదరాబాద్ రాయదుర్గం వద్ద సర్వే నెంబర్ 5/2 లోని 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో కూల్చి వేతలు చేపట్టింది.

HYDRAA: ఆ మధ్య భాగ్యనగరంలో కూల్చివేతలతో రోజూ వార్తల్లో నిలిచిన హైడ్రా ఈ మధ్య కొంచెం నెమ్మదైంది. ఇవాళ మళ్లీ తన జులుం విదిల్చింది. హైదరాబాద్ రాయదుర్గం దర్గా వద్ద సర్వే నెంబర్ 5/2 లోని 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. అనుమతి లేని లే ఔట్‌లో రహదారులు నిర్మిస్తూ నార్నే ఎస్టేట్ సంస్థ ప్లాట్లు అమ్మకాలు చేపట్టినట్టు హైడ్రా గుర్తించింది. చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించిన హైడ్రా ఈ మేరకు చర్యలు చేపట్టింది.
తాము రోజూ క్రికెట్ ఆడుకునే చోట ఆడనివ్వడం లేదని.. హైడ్రాకు అక్కడి యువకులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా ఈ మేరకు చర్యలు చేపట్టింది. అక్రమ నిర్మాణాలు తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.
కొండపూర్‌లోని హఫీజ్ పేట సర్వే నంబర్ 79లో 39 ఎకరాలు భూమిపై సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రా దృష్టికి వెళ్లింది. రెవెన్యూ రికార్డులలో సర్వే నంబరు 79 ప్రభుత్వ భూమి, నిషేధిత జాబితాగా ఉంది. ఆ సర్వే నంబరు 79/1 గా సృష్టించి వసంత హోమ్స్ సంస్థ ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టిందన్నది ఆరోపణ.
ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇళ్లు నిర్మించి అమ్మేసి.. ఇంకా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసు కార్యాలయంతో పాటు.. పలు షెడ్డులు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకు యిచ్చింది వసంత హౌస్ నిర్మాణ సంస్థ. దీంతో ప్రహరీతో పాటు లోపల చేపట్టిన నిర్మాణాలు హైడ్రా అధికారులు తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
అటు, వనస్థలిపురం ఇంజాపూర్‌లోనూ హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ పలు కాలనీలకు వెళ్ళే రోడ్డును ఆక్రమించినట్టు హైడ్రా అధికారులు గుర్తించి చర్యలు చేపట్టారు. రోడ్డు ఆక్రమణలపై హైడ్రా కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోడ్డుకు అడ్డంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
NIMS: నిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం..
Minister Ram Prasad Reddy: గుడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కార్..